మాజీ బాస్‌కి మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్
టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు రోజా. విద్యుత్ చార్జీలు పెంచారంటూ ఆగమాగం చేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీలో కరెంట్ కోతలు, విద్యుత్ చార్జీల పెంపుపై ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న ఆందోళనలపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. ఏపీని నరకాంధ్రప్రదేశ్‌గా మార్చేశారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. నారకాసుర ఆంద్రప్రదేశ్‌గా మార్చిన చంద్రబాబు వద్దనే ఏపీ ప్రజలు వైఎస్ జగన్‌కి అధికారం కట్టబెట్టారని ఆమె కౌంటరిచ్చారు. మహిళలపై నేరాలు తగ్గినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ చెబుతున్నాయని.. మహిళలను వేధించిన వారికి కఠిన శిక్షలు విధించేలా ప్రభుత్వం పనిచేస్తుందని రోజా అన్నారు.
బాదుడే బాదుడుపై రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో డిస్కంలకు చంద్రబాబు వేల కోట్ల బకాయిలు పెట్టారని అన్నారు. స్వల్పంగా విద్యుత్ చార్జీలు పెంచితే ఆగమాగం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ చార్జీలు పెంచలేదా అని రోజా ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేద్దామనుకున్నారని.. కానీ జగన్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులను పర్మినెంట్ చేసిందని ఆమె అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సైతం బకాయిలు పెట్టారని.. జగనన్న వచ్చిన తర్వాత వాటన్నింటినీ చెల్లిస్తూ వస్తున్నారని ఆమె చెప్పారు.
ఈ నెల 5వ తేదీన సీఎం వైఎస్ జగన్ తిరుపతి పర్యటన ఏర్పాట్లను మంత్రి రోజా పరిశీలించారు. ఎస్వీ స్టేడియం వద్ద నిర్వహించనున్న జగనన్న విద్యాదీవెన బహిరంగ సభ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అధికారులతో సమీక్షించారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం తొలిసారి ముఖ్యమంత్రి జగన్ జిల్లాకు రావడం సంతోషకరమన్నారు. అది కూడా తనకు ఇష్టమైన విద్యా దీవెన కార్యక్రమానికి రావడం హ్యాపీగా ఉందన్నారు. పేద విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్నా.. తమకు నచ్చిన విద్యను అభ్యసించేందుకు చిత్తశుద్ధితో సీఎం కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.