Mon Dec 23 2024 01:52:09 GMT+0000 (Coordinated Universal Time)
visakha Mlc Election : విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికకు రెండు రోజులే గడువు.. అభ్యర్థి ఉంటారా? లేదా బొత్స ఏకగ్రీవం అవుతారా?
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటి వరకూ టీడీపీ తమ అభ్యర్థి ఎవరో ప్రకటించలేదు.
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థి ఎవరో ప్రకటించలేదు. ఇంకా నామినేషన్లు దాఖలు చేయడానికి రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13వ తేదీ నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి గడువుగా నిర్ణయించారు. వైసీపీ తరుపున అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యానారాయణ ఈ నెల 12న అంటే రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇంత వరకూ అభ్యర్థిని ఖరారు చేయలేదు.
పోటీ చేయడంపై...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. ఆయన రేపు బయలుదేరి విజయవాడకు చేరుకుంటారు. రేపు అభ్యర్థిని ఖరారు చేస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే అనేక దఫాలుగా చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లా టీడీపీ నేతలతో చర్చించారు. ఎన్నికలలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది? లేకపోతే ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నలకు నేతల నుంచి విభిన్నమైన జవాబులు వచ్చాయని తెలిసింది. పోటీ చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయని కొందరు చెప్పగా, పోటీ చేసి ఓటమి పాలయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఎన్నికలో ఓటమి పాలయ్యామని రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని కొందరు చెబుతున్నారు.
క్యాంప్ లకు తరలించి...
దీంతో చంద్రబాబు నాయుడు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే వైసీపీ ఎంపీటీసీ, సర్పంచ్ లను క్యాంప్‌లకు తరలించింది. బెంగళూరులో క్యాంప్ ను ఏర్పాటు చేసుకుని నేరుగా పోలింగ్ రోజు విశాఖకు తరలించే ఏర్పాట్లు చేసుకుంది. రేపు బొత్స నామినేషన్ వేసిన తర్వాత విశాఖ కార్పొరేటర్లు కూడా కొందరు క్యాంప్‌నకు తరలి వెళతారని తెలిసింది. ఆగస్టు 30వ తేదీ వరకూ క్యాంప్ లోనే ఉంటారు. వారిని కాంటాక్టు చేయడానికి ఫోన్లు కూడా అందుబాటులో లేకుండా వైసీపీ నేతలు చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీకి సొంతంగా 615 మంది బలం ఉండటం, టీడీపీ కూటమికి 215 ఓట్లు మాత్రమే ఉండటంతో చంద్రబాబు కొంత అయోమయంలో ఉన్నారు. పోటీ చేద్దామా? లేక గౌరవంగా పక్కకు తప్పుకుందామా? మూడేళ్ల పదవి కోసం పరువు పోగొట్టుకోవడం ఎందుకని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story