Mon Dec 23 2024 07:13:50 GMT+0000 (Coordinated Universal Time)
TDP : అంత ఈజీ కాదు సామీ.. గెలవాలంటే... నేతలు చెమటోడాల్సిందేనా?
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సీటును గెలుచుకోవడానికి టీడీపీ చివరి ప్రయత్నాలు మొదలు పెట్టింది.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఉత్తరాంధ్రలో ఈ సీటును గెలుచుకోవడానికి టీడీపీ చివరి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే భారీ స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగితే తప్ప వైసీపీపై గెలిచే అవకాశాలు లేవు. మరొక వైపు వైసీపీ ఉత్తరాంధ్రలో స్ట్రాంగ్ లీడర్ అయిన బొత్స సత్యనారాయణ పేరు ఖరారు చేసింది. బొత్స సత్తిబాబు ఎన్నికల వ్యూహాలను అధిగమించాలంటే సామాన్య విషయం కాదు. ఆ విషయం అధినాయకత్వానికి తెలియంది కాదు. ఎందుకంటే.. టీడీపీ కూటమి విజయం సాధించాలంటే ఆషామాషీ విషయం కాదు. ఎన్నో ఎత్తుగడలు వేయాల్సి ఉంటుంది. అవతల పార్టీ నుంచి తమ వైపునకు తిప్పుకోవాల్సి ఉంటుంది.
బలాబలాలను చూస్తే...
స్థానిక సంస్థల విశాఖ ఎమ్మెల్సీ పదవి మరో మూడేళ్ల కాలం ఉంది. అయితే బలాబలాలను చూస్తే వైసీపీకి ఆరువందలకు పైగా ఓట్లుండగా, టీడీపీకి కేవలం దాదాపు 250 మాత్రమే ఉన్నాయి. భారీ సంఖ్యలో వైసీపీ నుంచి చేరికలను ప్రోత్సహించాలంటే ఇప్పుడున్న సమయం సరిపోతుందా? అన్న చర్చ జరుగుతుంది. పదవులు, మరొక రకమైన ప్రలోభాలు పెట్టేందుకు ఉత్తరాంధ్రలో ఇప్పుడు టీడీపీ కూటమికి సరైన నేత లేరు. నేతలు లేరని కాదు.. ఉన్నారు. కానీ సీనియర్ నేతలు ఎవరికీ మంత్రి పదవులు దక్కలేదు. ఆర్థికంగా బలమైన నేతలు, సామాజికపరంగా స్ట్రాంగ్ అయిన నేతలున్నారు. అయితే వారెవ్వరికీ మంత్రి పదవులు దక్కకపోవడంతో కొంత దూరంగా ఉండే అవకాశముంది.
హోంమంత్రి ఉన్నా...
హోంమంత్రి వంగలపూడి అనిత ఉన్నారు. అయితే ఆమె ఎంత వరకూ వైసీపీ ఓట్లను తమ వైపునకు తిప్పుకోగలగుతారన్నది అనుమానమే. మరో సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఉన్నారు. ఆయన నేరుగా ఈ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేని పరిస్థితి. ఇక సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, అశోక్ గజపతి రాజు, బండారు సత్యనారాయణమూర్తి వంటి వారున్నప్పటికీ వారు ఎంత మేర ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనసు పెట్టి పని చేస్తారన్నది అనుమానమే. టీడీపీ నేతలను సమన్వయం చేసుకుని వైసీపీ ఓట్లను తమ వైపునకు తిప్పుకునేందుకు సరైన నేత మాత్రం కనిపించడం లేదు. అదే ఇప్పుడు మైనస్ పాయింట్ గా కనపడుతుంది.
పల్లా ఉన్నప్పటికీ...
మరో వైపు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన ఒక్కరే కొంత సమన్వయం చేయగలిగిన నేతగా కనపడుతున్నారు. అచ్చెన్నాయుడుకు ఈ బాధ్యత అప్పగించినా ఆయనపై పార్టీ నేతల్లో ఉన్న వ్యతిరేకత ఎంత వరకూ పనిచేస్తుందన్నది చెప్పలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతను రంగంలోకి దించేందుకు పార్టీ నాయకత్వం భావిస్తుందని తెలిసింది. ఇక అభ్యర్థి బలమైన వాడైతే ఆయనే చూసుకుంటారులేనన్న ధీమాలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు కనపడుతుంది. ఇలా విశాఖ ఎమ్మెల్సీ పదవిని దక్కించుకనేందుకు టీడీపీ మాత్రం శ్రమించినా ఎంత మేరకు ఫలితం ఉంటుందన్నది చెప్పలేని పరిస్థిితి.
Next Story