Sat Dec 21 2024 11:50:36 GMT+0000 (Coordinated Universal Time)
Mudragada : ముద్రగడ రాజకీయం ఇక ముగిసినట్లేనా? కాపులు దూరమయినట్లేనా?
కాపు ఉద్యమనేతగా ఎన్నికలకు ముందు వరకూ ఉన్న ముద్రగడ పద్మనాభం తర్వాత వైసీపీలో చేరారు.
కాపు ఉద్యమనేతగా ఎన్నికలకు ముందు వరకూ ఉన్న ముద్రగడ పద్మనాభం తర్వాత వైసీపీలో చేరారు. జగన్ గెలుపు గ్యారంటీ అని బలంగా నమ్మిన ఆయన ఊహించని శపథం చేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. పవన్ కల్యాణ్ గెలుపుతో ఆయన తనపేరును అధికారికంగా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. టీడీపీ కూటమిని బలంగా వ్యతిరేకించిన ముద్రగడ పెద్ద తప్పుచేశారని కాపు సామాజికవర్గంలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్‌కు మద్దతు ఇవ్వకుండా ఆయన జగన్ వైపు వెళ్లడం నచ్చని కాపు నేతలు ముద్రగడ పద్మనాభానికి దూరమయ్యారు.
సామాజికవర్గం నేతగానే...
ముద్రగడ పద్మనాభం ఒకరకంగా కాపు సామాజికవర్గం బలంతోనే బలమైన నేతగా ఎదిగారు. కాపు ఉద్యమ నేతగా ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. నిజాయితీ ఉన్న నేతగా ఆయనకు పేరుంది. అందరినీ గౌరవంతో పిలిచే ముద్రగడ పద్మనాభం 2014 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత కాపు రిజర్వేషన్ల కోసం గట్టిగా పోరాటం చేశారు. 2019 ఎన్నికల్లో కాపులను టీడీపీకి వ్యతిరేకంగా మలచడంలోనూ, వైసీపీకి అనుకూలంగా మార్చడంలోనూ ముద్రగడ పద్మనాభం సక్సెస్ అయ్యారు. అందుకే జగన్ కు ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలు లభించి అధికారంలోకి రాగలిగారు.
జగన్ ప్రభుత్వంలో...
కానీ జగన్ ప్రభుత్వంలో ఉన్న ఐదేళ్లు ఆయన కాపు రిజర్వేషన్ల పై నోరు మెదపలేదు. జగన్ తాను కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పినా ఉద్యమాలకు పిలుపు ఇవ్వకుండా ఆయన ఒక పక్షం వహించారన్న విమర్శలను ఎదుర్కొన్నారు. చివరకు జనసేనలో చేరేందుకు ఎన్నికలకు ముందు సిద్మయినా ముదగ్రడను చేర్చుకునేందుకు పవన్ సిద్ధపడకపోవడంతో ఆయన నేరుగా వైసీపీలో అధికారికంగా చేరిపోయారు. కానీ మొన్నటి ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం ప్రభావం ఏమాత్రం పనిచేయలేదు. వైసీపీకి తూర్పు గోదావరి జిల్లాలో దారుణమైన సీట్లు లభించాయి. 19 అసెంబ్లీ స్థానాలకు ఒక్కస్థానం కూడా రాలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ పదిహేను స్థానాల్లో ఒక్కింటిలోనూ గెలవలేకపోయింది.
పవన్ వెంట...
దీంతో ముద్రగడ సైలెంట్ అయిపోయారు. వైసీపీకి కూడా ఆయన దూరంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. వైసీపీ నుంచి అనేక మంది కాపు సామాజికవర్గం నేతలు వెళ్లిపోతున్నారు. వారంతా జనసేనలో చేరిపోతున్నారు. అంటే కాపు సామాజికవర్గం ముద్రగడ చేతుల్లో నుంచి పవన్ కల్యాణ్ చేతుల్లోకి వెళ్లిందన్నది వాస్తవం. పవన్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారన్న ఆశాభావం ఆ సామాజికవర్గంలో కనిపిస్తుంది. అందుకే కాపులు ముద్రగడకు దూరమయ్యారంటున్నారు. పైగా నిలకడలేని ముద్రగడ స్వభావం కూడా ఆయనను రాజకీయంగా ఇబ్బంది పెట్టిందని చెప్పొచ్చు. ఆయన వయసు కూడా పెరిగిపోయింది కాబట్టి ముద్రగడ పద్మనాభం పట్టు కాపు సామాజికవర్గంపై ముగిసినట్లేనని అనుకోవచ్చు.
Next Story