Mon Dec 23 2024 06:29:47 GMT+0000 (Coordinated Universal Time)
అన్న గారి కుటుంబంలో.. వీరిద్దరూ....?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు నందమూరి కుటుంబం అండగా నిలిచింది. కానీ హరికృష్ణ కుటుంబం దూరంగా ఉందనే చెప్పాలి.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు నందమూరి కుటుంబం అండగా నిలిచింది. కానీ హరికృష్ణ కుటుంబం దూరంగా ఉందనే చెప్పాలి. హరికృష్ణ కూతురు సుహాసిని మాత్రం హాజరయ్యారు. హరికృష్ణ కుటుంబ సభ్యుల్లో ప్రధానంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు మాత్రం మీడియా సమావేశానికి దూరంగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు అసెంబ్లీలో జరిగిన ఘటనను ఖండించారు.
రెస్పాన్స్...
కానీ కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్లు వీరిద్దరూ వ్యవహరించారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి గురించి అసెంబ్లీలో విన్పించిన కామెంట్స్ పై హరికృష్ణ కుటుంబం నుంచి వచ్చిన రెస్పాన్స్ అంతంత మాత్రమేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న ఆసక్తితో అందరూ ఎదురు చూశారు. కానీ ఆయన చేసిన ట్వీట్ ఎవరినీ నొప్పించక.. అన్నట్లుగా ఉందంటున్నారు.
నాన్నకు అన్యాయం జరిగిందని...
కల్యాణ్ రామ్ సయితం అదే రీతిలో స్పందించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. హుందాగా వ్యవహరించాలని కోరారు. హరికృష్ణ మరణం తర్వాత ప్రధానంగా ఆయన కుటుంబంలోని జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు తెలుగుదేశం పార్టీకి, నారా వారి ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. హరికృష్ణకు పార్టీలో అన్యాయం జరిగిందని వారు నమ్ముతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన పట్టించుకోలేదన్న భావనలో ఉన్నారు.
మనస్ఫూర్తిగా మద్దతివ్వకుండా....
అందుకే చంద్రబాబుకు నేరుగా, మనస్ఫూర్తిగా మద్దతివ్వలేదన్న కామెంట్స్ పార్టీలో విన్పిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలోనే కాదు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లోనూ ఈ చర్చ జరుగుతోంది. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలనుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ ఎపిసోడ్ లో కూడా మమ అనిపించేలా వ్యవహరించారంటున్నారు. మొత్తం మీద నందమూరి కుటుంబంలో క్రేజ్ ఉన్న వారిలో బాలకృష్ణ తప్పించి హరికృష్ణ కుటుంబం దూరంగానే ఉందని చెప్పాలి.
Next Story