Mon Dec 23 2024 04:09:29 GMT+0000 (Coordinated Universal Time)
డీజీపీ ఏపీలో ఉన్నాడా? పోలీసులూ ఖబడ్డార్
కొత్త డీజీపీ వచ్చాక ఏపీలో పరిస్థితులు ఇంకా దారుణంగా తయారయ్యాయని చంద్రబాబు అన్నారు
వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను మూడేళ్లలో వల్లకాడు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజలు భయభ్రాంతులతో బతుకుతున్నారన్నారు. ప్రజలు తమ సమస్యలను చెప్పుకునే పరిస్థితులు లేవన్నారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్ మూడేళ్ల పాలనపై ఛార్జిషీట్ విడుదల చేశారు. 37 మంది టీడీపీ కార్యకర్తలు ఈ మూడేళ్లలో హత్యకు గురయ్యారన్నారు. పోలీసు వ్యవస్థ పూర్తిగా నీరుగారి పోయిందన్నారు. పోలీసులు తమ పనీతీరు మార్చుకోకపోతే ఫలితం అనుభవిస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో బడుగు, బలహీన వర్గాలే హత్యలకు గురవుతున్నారని చంద్రబాబు అన్నారు.
డీజీపీ ఉన్నాడా?
రాష్ట్రంలో డీజీపీ ఉన్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ రెడ్డి ఐదేళ్లు ఉంటారని, 35 ఏళ్లు సర్వీసులో ఉండే మీరు ఇలా చేయడం తగదని హితవు పలికారు. కోనసీమలో చిచ్చు పెట్టి అక్కడ వారిని బానిసలుగా మార్చేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తుందన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదన్నారు. పల్నాడు జిల్లాలో ఐదుగురు బీసీలను చంపేశారన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఏం జరిగిందో ప్రజలు గుర్తించాలన్నారు. ఈ కేసులో ముగ్గురు సాక్షులు మరణించారని, దీనిపై సమాధానం చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు.
బానిసగా మారి....
కొత్త డీజీపీ వచ్చాక ఏపీలో పరిస్థితులు ఇంకా దారుణంగా తయారయ్యాయని చెప్పారు. ప్రశ్నించిన వారిపైనే కేసులు పెడుతున్నారన్నారు. ఒక నేరగాడు ముఖ్యమంత్రి అయితే పాలన ఇలానే ఉంటుందన్నారు చంద్రబాబు. సీబీఐ అధికారులనే బెదిరించే పరిస్థితికి వచ్చారన్నారు. పోలీసులు ఒక నేరగాడికి బానిసగా మారారన్నారు. పదో తరగతి పరీక్షల్లో రెండు లక్షల మంది ఫెయిలయ్యారంటే నీ విధానం ఏంటి అని చంద్రబాబు నిలదీశారు. ఎనిమిది మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారన్నారు. పిల్లల జీవితాన్ని సర్వనాశనం చేశారన్నారు. వైసీపీది సామాజిక న్యాయం కాదని, సామాజిక హత్యలని చంద్రబాబు అన్నారు.
సీబీసీఐడీ వేధింపులకే...
సీబీసీఐడీ విపక్ష నేతలను వేధిస్తుందని చంద్రబాబు అన్నారు. 41ఎ నోటీసులు ఇవ్వాడానికి కాదు ఆ శాఖ ఉందన్నారు. ఖచ్చితంగా రాజ్యాంగ హక్కుల కోసం పోరాడతామని చెప్పారు. పోలీసుల ప్రవర్తనపై ప్రజల్లో చైతన్యం కల్గిస్తున్నానని చెప్పారు. పోలీసుల బాస్ డీజీపీ కాదు..తాడేపల్లిలో కూర్చున్న సజ్జల అని చెప్పారు. తాను ప్రజలకు భరోసా ఇవ్వడానికి రెడీ ఉన్నామన్నారు. అక్రమ కేసులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీసులు వైసీపీ గూండాల్లా తయారయ్యారన్నారు.
Next Story