Mon Dec 23 2024 13:44:13 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీని బీహార్ కంటే దారుణంగా మార్చేశారంటున్న నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీహార్ కంటే దారుణంగా మార్చేశారని తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీహార్ కంటే దారుణంగా మార్చేశారని తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ అనంత బాబుని వెంటనే అరెస్టు చేయాలని నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలని ఆయన ట్విటర్లో కోరారు. సుబ్రహ్మణ్యంను రాత్రి కారులో తీసుకెళ్లిన ఎమ్మెల్సీ కారణం చెప్పకుండా మృతదేహాన్ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు, భార్యకు అప్పగించి వెళ్లడం అనుమానాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. హత్యను ప్రమాద ఘటనగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దారుణమని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ అనంత బాబుని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు.
ఏపీని బీహార్ కంటే దారుణమైన రాష్ట్రంగా మార్చేసింది వైసీపీ మాఫియా అని.. వైసీపీ నాయకుల నేరాలు, ఘోరాలకి సామాన్యులు బలైపోతున్నారన్నారు నారా లోకేష్. తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యాన్ని అత్యంత దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు, యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం.. రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస క్రీడకు అద్దం పడుతోందన్నారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులకు హత్యలు అరాచకాలు చేసుకోమని స్పెషల్ లైసెన్స్ ఏమైనా ప్రభుత్వం ఇచ్చిందా? సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు, అతని అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
అనంత ఉదయ్ బాబు మాట్లాడుతూ, సుబ్రహ్మణ్యం గత ఐదేళ్లుగా తన వద్ద డ్రైవర్ గా పని చేస్తున్నాడని చెప్పారు. రెండు నెలల నుంచి సరిగా పనికి రావడం లేదని అన్నారు. సుబ్రహ్మణ్యంకు మద్యం తాగే అలవాటు ఉందని, ద్విచక్ర వాహనంపై అనేకసార్లు ప్రమాదానికి గురయ్యాడని చెప్పారు. రాత్రి కూడా సుబ్రహ్మణ్యం యాక్సిడెంట్ కు గురైనట్టు తెలిసిందని, దీంతో అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చానని అనంత ఉదయ్ బాబు తెలిపారు. చికిత్స కోసం అతడిని కాకినాడలోని అమృత ఆసుపత్రికి తీసుకెళ్లామని.. ఆసుపత్రి వద్దకు అతని తల్లిదండ్రులు కూడా వచ్చారని చెప్పారు. ఆసుపత్రిలో సుబ్రహ్మణ్యం చనిపోవడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్తామని చెప్పడంతో భౌతికకాయాన్ని కారులో అపార్ట్ మెంట్ వద్దకు పంపించామని వివరణ ఇచ్చారు.
Next Story