Sun Dec 22 2024 20:36:02 GMT+0000 (Coordinated Universal Time)
తనకే కిషన్ రెడ్డి ఫోన్ చేశారు.. అందుకే
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలవాలనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనకు ఫోన్ చేశారని నారా లోకేష్ తెలిపారు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలవాలనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనకు ఫోన్ చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. ఆయన ఫోన్ చేయడంతోనే తాను అమిత్ షాను కలిసేందుకు ఢిల్లీ వెళ్లానని చెప్పారు. అమిత్ షాను కలసి ఆయనకు అన్ని విషయాలను వివరించానని చెప్పారు. చంద్రబాబు ఆరోగ్య పరంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపానని లోకేష్ చెప్పారు. తన తండ్రికి భద్రత పరంగా ఉన్న ఆందోళనను కూడా అమిత్ షాకు వివరించానని చెప్పానన్నారు.
నిజం వైపు ఉండాలని...
సీఐడీ ఎన్ని కేసులు పెట్టారని, ఎందుకు పిలిచిందని తనను అమిత్ షా అడిగారని లోకేష్ తెలిపారు. అన్నీ రాజకీయ కక్షతో పెట్టిన కేసులేనని తాను చెప్పానన్నారు. బీజేపీ పేరు చెప్పి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నట్లు తాను వివరించానని అన్నారు. అయితే తమ ఇద్దరి మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని లోకేష్ తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ వెనక బీజేపీ ఉందని ఒక పార్లమెంటు సభ్యుడు, ఒక మంత్రి అన్న విషయాన్ని కూడా తాను చెప్పానని అన్నారు. నిజం వైపు ఉండాలని తాను అమిత్ షాను కోరినట్లు వివరించారు.
Next Story