Mon Dec 23 2024 04:53:48 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు ఆ వ్యాధి ఉంది : నారా లోకేష్
ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ.. రాష్ట్రాన్ని నాశనం చేసి ప్యాలస్ లో పడుకున్నాడని దుయ్యబట్టారు. ఇప్పటి వరకూ..
టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కడప జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా మైదుకూరులో నిర్వహించిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. యువగళం ప్రభంజనం చూస్తుంటే.. ప్యాలస్ పిల్లికి నిద్రపట్టడం లేదంటూ పరోక్ష విమర్శలు చేశారు. తనపై ఇటీవల జరిగిన కోడిగుడ్ల దాడి గురించి మాట్లాడుతూ.. ఆ పని చేయించింది ప్యాలస్ పిల్లేనన్నారు. వైసీపీ పార్టీ గుర్తు ఫ్యాన్ కాదని, కోడిగుడ్డుగా మారిందని వ్యంగ్యం ప్రదర్శించారు. కోడిగుడ్లు వేసిన వాళ్ల ముఖాలపై తెలుగు తమ్ముళ్లు ఆమ్లెట్ వేసి పంపారన్నారు. సైకోస్ చీకట్లో కోడిగుడ్లు విసరడం కాదు దమ్ముంటే నేరుగా వచ్చి నిలబడితే.. పసుపు సైన్యం పవర్ ఏంటో చూపిస్తామన్నారు.
"నాకు మా నాన్నంత ఓపిక అసలు లేదు. అడ్డుకుంటాం అంటూ ఎవడైనా వస్తే దబిడి దిబిడే." నని లోకేష్ హెచ్చరించారు. ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ.. రాష్ట్రాన్ని నాశనం చేసి ప్యాలస్ లో పడుకున్నాడని దుయ్యబట్టారు. ఇప్పటి వరకూ ఏపీ ముఖ్యమంత్రి 12 లక్షల కోట్ల అప్పుచేసి.. ప్రతిఒక్కరికీ రూ.2 లక్షల అప్పులను పంచాడని విమర్శించారు. జగన్ అప్పుల అప్పారావు అని చంద్రన్న సంపద సృష్టికర్త అని చెప్పుకొచ్చారు. జగన్ ది కక్షసాధింపు.. చంద్రన్నది రాజనీతి అన్నారు. వైసిపి అంటే కోడికత్తి, కోడి గుడ్డు...టిడిపి అంటే తెలుగు వారి ఆత్మగౌరవం అని చెప్పుకొచ్చారు.
వివేకా హత్య కేసు గురించి మాట్లాడుతూ.. జగన్ పాముకంటే ప్రమాదమన్నారు. సొంత బాబాయ్ ని జగన్, అవినాష్ కలిసి చంపేశారని.. ఇప్పుడు సొంత చెల్లే వాళ్లకి ఎదురుగా రహస్య సాక్షిగగా మారిందన్నారు. ఆ కేసు నుండి బయటపడటానికి విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డిని బలి ఇచ్చాడని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో జగన్ కు సహాయం చేసిన కేసీఆర్ కే జగన్ కు టోపీ పెట్టాడన్నారు. అవినాష్ రెడ్డి, భారతి రెడ్డిని వివేకా కేసు నుండి కాపాడేందుకు ఇప్పుడు కవితను బలిస్తున్నారన్నది ఢిల్లీలో టాక్ వినిపిస్తోందన్నారు. ఎవరెన్ని స్కెచ్ లు వేసినా నిజం దాగదని, ఎప్పటికైనా బయటపడుతుందన్నారు.
తాను కడప బిడ్డనంటూ పదేపదే చెప్పుకునే జగన్ కు పులివెందుల్లో బస్టాండ్ కట్టడానికి నాలుగేళ్లు పట్టిందని విమర్శించారు. సొంతజిల్లాకు ఏమేం చేశారో దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలన్నారు. కడప జిల్లాకు ఇచ్చిన ఒక్కహామీని కూడా నిలబెట్టుకోలేదని ఎద్దేవా చేశారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏం అయ్యింది? అన్నమయ్య బాధితులకు న్యాయం ఎప్పుడు చేస్తావ్? అని బహిరంగ సభలో ప్రశ్నించారు. నిన్న హడావిడి గా గండికోట నిర్వాసితులకు న్యాయం చేస్తాం అంటూ అధికారులు హడావిడి మొదలుపెట్టారు. అది యువగళం పవర్ అన్నారు. జగన్ కి మైథోమానియా సిండ్రోమ్(mythomania syndrome) అనే జబ్బుతో జగన్ బాధపడుతున్నాడన్నారు. ఈ జబ్బు లక్షణాలు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అబద్దాలు చెప్పడమేనని లోకేష్ అన్నారు.
Next Story