యువగళంలో మరో మైలురాయి
తాడేపల్లిలో లోకేష్ పాదయాత్ర మొదలవ్వగా.. సీతానగరం వద్ద 2,500 కి.మీ పూర్తయింది
నారాలోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 2500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో లోకేశ్ శిలాఫలకం ఆవిష్కరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే, ఏం చేస్తుందనే హామీలన్నీ ఆ శిలాఫలకంపై పొందుపరిచారు. అసైన్డ్, కొండ, వాగు, అటవీ, రైల్వే, ఇతర భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లని క్రమబద్ధీకరించి పట్టాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో నివసిస్తున్న ఇళ్లు లేని నిరుపేదలకు 20 వేల ఇళ్లు నిర్మిస్తానని మరోసారి హామీ ఇచ్చారు నారా లోకేశ్.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. నేడు మధ్యాహ్నం రెండు గంటలకు తాడేపల్లిలో లోకేష్ పాదయాత్ర మొదలవ్వగా.. సీతానగరం వద్ద 2,500 కి.మీ పూర్తయింది. దీంతో అక్కడ శిలాఫలకం ఆవిష్కరణ జరిగింది. ప్రకాశం బ్యారేజ్ మీదుగా విజయవాడలోకి లోకేష్ అడుగుపెట్టనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు వీడ్కోలు పలకనుండగా.. కృష్ణా జిల్లా నేతలు స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్‌పై లోకేష్‌కు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్దా వెంకన్న దగ్గరుండి ఏర్పాట్లు చేశారు.