Fri Dec 20 2024 17:24:01 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : మద్యం షాపులు ఏపీలో పెట్టాలంటే చెల్లించాల్సింది ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం పాలసీని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం పాలసీని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఈ విధానం ప్రకారం ప్రయివేటు వ్యక్తులకు లిక్కర్ దుకాణాల ఏర్పాటుకు అనుమతిస్తారు. ఇందుకోసం కొన్ని నిబంధనలను ఏపీ ప్రభుత్వం రూపొందించినట్లు తెలిసింది. లిక్కర్ షాపు ఏపీలో పెట్టాలంటే ముందుగా ప్రభుత్వానికి రెండు లక్షల రూపాయలు చెల్లించి దరఖాస్తు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయిస్తుంటుంది. మొత్తం 3,746 లిక్కర్ షాపులలో పది శాతం మాత్రం గీత కార్మికుల కోసం కేటాయించింది. ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకే మద్యం దుకాణాలను అనుమతిస్తారు.
లాటరీ పద్ధతి ద్వారా...
మిగిలిన మద్యం దుకాణాలను లాటరీల ద్వారా కేటాయింపు చేస్తారు. వీరంతా రెండు లక్షల రూపాయలు దరఖాస్తు చెల్లించి లాటరీలో పాల్గొనాల్సి ఉంటుంది. రెండేళ్ల కాలపరిమితిలో ఈ మద్యం దుకాణాలను నిర్వహించుకోవచ్చు. అయితే జనాభా ప్రాతిపదికన ఒక్కొక్క లిక్కర్ షాపునకు యాభై నుంచి 85 లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. పన్నెండు ప్రధాన నగరాల్లో పన్నెండు ప్రీమియం లిక్కర్ స్టోర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వానికి ఆదాయంతో పాటుగా నాణ్యమైన మద్యం అందించేందుకు అన్ని బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చే విధంగా నూతన పాలసీని రూపొందించింది.
Next Story