Thu Dec 19 2024 15:02:47 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఫ్రీ బస్సు పై చంద్రబాబు కీలక నిర్ణయం.. అమలు ఎప్పటి నుంచి అంటే?
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఒక్కొక్కటిగా తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా ఇప్పటికే పింఛన్లను నాలుగు వేల రూపాయలను పెంచుతూ గత నెల నుంచి అమలు చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశారు. మెగా డీఎస్సీకి సంబంధించి దాదాపు పదహారు వేల పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమయింది. ఇందులో భాగంగా ఈ పరీక్షలో పాల్గొనేందుకు ముందుగా టెట్ ను నిర్వహించాలని నిర్ణయించింది. ఇలా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ చంద్రబాబు తన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసుకుంటూ వెళుతున్నారు.
రెండు నెలలవుతున్నా....
అయితే అధికారంలోకి వచ్చి రెండు నెలలవుతున్నా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎప్పడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇందుకోసం నేడు చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపైనే చర్చిస్తారని చెబుతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం ప్రవేశ పెడితే ఆర్టీసీకి ఎంత మేరకు నష్టం వాటిల్లుతుంది? ఆ నష్టాన్ని భర్తీ చేయడం ఎలా? అన్న దానిపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్షలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఫ్రీ బస్సు సౌకర్యం వల్ల...
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేలా చంద్రబాబు చర్యలు తీసుకోనున్నారు. అదే రోజు అన్నా క్యాంటిన్లను కూడా ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తే అవసరమైన బస్సులున్నాయా? మరిన్ని బస్సులు కొనుగోలు చేయాలా? పురుషులు ఇబ్బందులు పడకుండా మహిళలకు ఉచిత ప్రయాణం ఎలా కల్పించవచ్చు? ఏ ఏ బస్సుల్లో ఫ్రీ ఇవ్వాలి? అన్న దానిపై అధికారులతో చర్చించనున్నారు. ఇప్పటికే అమలవుతున్న తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేసి నివేదికను వెంటనే సమర్పించాలని చంద్రబాబు రవాణా శాఖ అధికారులను నేడు ఆదేశించనున్నారు. సో.. ఏపీ మహిళలూ ఇది గుడ్ న్యూస్ కదా?
Next Story