Sun Dec 22 2024 23:22:26 GMT+0000 (Coordinated Universal Time)
Employees : వాళ్ల కళ్లల్లో ఆనందం చూడాలనే చంద్రబాబు కీలక నిర్ణయం.. ప్రభుత్వోద్యోగులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఎన్నికల సందర్భంగా కూటమి ఎన్నో హామీలు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఎన్నికల సందర్భంగా కూటమి ఎన్నో హామీలు ఇచ్చింది. పేదలకు, మహిళలకు అనేక వాగ్దానాలను ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే మహిళలకు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది. ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. ఇక ఎన్నికల్లో కీలకమైన, ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులకు కూడా ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చారు. వాగ్దానాలు చేశారు. అందుకే ఈ ఎన్నికల్లో ప్రభుత్వోద్యోగుల్లో ఎక్కువ శాతం మంది ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఓటు వేశారు. పోస్టల్ బ్యాలట్ ఓట్లను సద్వినియోగం చేసుకుని కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ప్రభుత్వోద్యోగులు కూబి కీలక భూమిక పోషించారు.
అనేక హామీలు ఇచ్చి...
అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఎన్నికల్లో విధులు నిర్వహించిన సిబ్బందికి ఒక నెల జీతం బోనస్ గా కూడా ఇచ్చారు. ఇంకా అనేక హామీలు ఉన్నప్పటికీ ప్రధాన మైన హామీ ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతం ప్రతి నెల ఒకటో తేదీ చెల్లించడమే. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు వేతనాలు వస్తాయో తెలియని పరిస్థితి. ముందు సంక్షేమ పథకాలకు లబ్దిదారుల ఖాతాల్లో నిధులు విడుదల చేసిన తర్వాత మిగిలిన సొమ్మును ప్రభుత్వ ఉద్యోగులకు దశల వారీగా చెల్లించడం ప్రారంభించింది. గత ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత రావడానికి కూడా ప్రధాన కారణం ఒకటో తేదీన జీతాలు చెల్లించకపోవడమే.
ఒకటో తేదీన...
అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీని ఒక్కొక్కటి అమలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ప్రతి నెల ఒకటో తేదీ జీతం చెల్లించాలని సిద్ధమయ్యారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి మాసం జులై రావడంతో ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని నిర్ణయించారని తెలిసింది. ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే జులై ఒకటో తేదీన సోమవారం నాడే ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకేసారి జీతం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు ప్రారంభమయినట్లు తెలిసింది. వేతనాలకు సంబంధించిన నిధులను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది.
రేపే బ్యాంకు ఖాతాల్లో...
ఒకటో తేదీ ఉదయాన్నే రాష్ట్రంలోని 65 లక్షల మంది పింఛనుదారులకు ఏడువేల రూపాయలు చెల్లించనుంది. గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ఈ పింఛను మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించారు. ఇందుకు 65 లక్షల మందికి ఏడు వేల చొప్పున ఇవ్వాలంటే 4,408 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. అది పక్కన పెడితే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రిటైర్ అయిన ఉద్యోగుల పింఛన్లను కూడా అదే రోజు వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం 5,500 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. మొదటి రోజు ప్రభుత్వ ఉద్యోగులు జీతం తీసుకుని వారి కళ్లల్లో ఆనందం చూడాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యం పాలనలో బలంగా ఉండాలని భావించిన చంద్రబాబు నాయుడు ఈ మేరకు రేపు వారి ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
Next Story