Wed Dec 25 2024 02:22:45 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఆ కుటుంబాలకు మరో గుడ్ న్యూస్ ... తల్లికి వందనం నిధులు విడుదలకు మార్గదర్శకాలేవంటే?
కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు వరసగా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళుతున్నా
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ .. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరసగా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళుతున్నారు. తొలి రోజే ఐదు సంతకాలు చేశారు. ఇక మరికొన్ని కీలక మైన హామీలు కూడా వేచి చూస్తున్నాయి. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా అధికారులతో నిధుల సమీకరణపై చంద్రబాబు త్వరలోనే ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. నిధులను వీలయినంత త్వరితగతిన సమీకరించి మరొక ప్రధాన మైన హామీని కూడా అమలు చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించిందని చెబుతున్నారు.
నిధులు విడుదల చేయడానికి...
ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పదమూడో తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి తల్లికి వందనం పథకాన్ని ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మవొడి పథకం కింద తల్లి ఖాతాలోనే నిధులను జమ చేసేవారు. అయితే చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇంట్లో ఎంత మంది విద్యార్థులున్నా వారికి ఈ పథకం వస్తుందని కూడా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. గత ప్రభుత్వం మాత్రం అమ్మఒడి ఇంటికి ఒక్కరికే ఈ పథకాన్ని అందించింది.
పాఠశాలలు ప్రారంభం కావడంతో...
దీంతో పాఠశాలలు ప్రారంభం కావడంతో తల్లికి వందనం కింద నిధులు జమ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రతి వాళ్లు రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు ఉండాలని చెబుతున్నారు. ఎంత మంది పిల్లలున్నా అందరూ చదువుకుంటూ ఉండాల్సిందే. చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడంతో ఇప్పుడు దీనిపై అధికారులు కసరత్తులు ప్రారంభించారు. హాజరు శాతం కూడా 75 శాతం పైన ఉంటేనే గత ప్రభుత్వం అమ్మఒడి పథకం నిధులు విడుదల చేసేది. దానిని ఈ ప్రభుత్వం అలాగే కొనసాగించే వీలుండేది. దీంతో పాటు పేద వర్గాలకు చెందిన వారై ఉండాలన్నది మరొక షరతు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా ఈ పథకం వర్తించదని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. మార్గదర్శకాలు త్వరలో అధికారికంగా ప్రభుత్వం విడుదల చేయనుంది.
Next Story