Tue Dec 24 2024 12:34:25 GMT+0000 (Coordinated Universal Time)
Tg Bharath : కేబినెట్ లో చోటు ఖాయమా.. అదే ఆయనకు కలసి వచ్చే అంశమా?
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే అదే రోజు కొందరు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన కొందరు మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం ఆరోజు చేస్తారంటున్నారు. అయితే ఒక విషయంలో మాత్రం కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఆరోజు మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారా? లేక మరొక రోజు ఆ కార్యక్రమాన్ని చేపడతారా? అన్నది తేలాల్సి ఉంది. అయితే ఎంతోమంది ఆశావహులున్నారు. ఈసారి అత్యధికంగా శాసనసభ్యులుగా ఎన్నిక కావడంతో కొంతమందికే అవకాశం దక్కుతుంది.
సామాజికవర్గాల నేపథ్యంలో...
అయితే కొన్ని కారణాలతో కొందరికి కేబినెట్ లో బెర్త్ లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేబినెట్ కూర్పు అంటే సామాజికవర్గాల కూర్పు అన్నది అందరికీ తెలిసిందే. కేబినెట్ లో అన్ని సామాజికవర్గాలకు చోటు కల్పించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఈ ఎన్నికల్లో తమకు విజయాన్ని అందించిన సామాజికవర్గాలను అసలు విస్మరించకూడదు. ఆ సంగతి నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలుసు. అందుకోసమే క్యాస్ట్ ఈక్వేషన్లు ఈ కేబినెట్ లో బాగా పనిచేస్తాయనిచెప్పక తప్పదు. అందులో భాగంగా కొందరికి మంత్రి పదవి వెతుక్కుంటూ వస్తుంది. అలాంటి వారిలో కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యే టీజీ భరత్ ఒకరు.
అన్ని రకాలుగా...
టీజీ భరత్ బ్యాక్ గ్రౌండ్ బలం. ఆయన సామాజికవర్గం కూడా ఈసారి ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసిందన్న అంచనాలు ఉన్నాయి. వైశ్య సామాజికవర్గం నుంచి టీజీ భరత్ ను మంత్రిగా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఆయన లోకేశ్ టీం కావడంతో పని మరింత సులువుగా మారిందని చెబుతున్నారు. టీజీ భరత్ వైశ్య సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారం ఊపందుకుంది. తండ్రి టీజీ వెంకటేశ్ బీజేపీలో చేరినా ఆయన మాత్రం గత ఐదేళ్ల నుంచి కర్నూలు నియోజకవర్గంలో పార్టీకోసం గట్టిగా పనిచేశారు. తండ్రి మరో పార్టీలో ఉన్నా టీడీపీ బలోపేతానికి ఆయన బాగా పనిచేశారన్న పేరు తెచ్చుకున్నారు. సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్యనే ఉంటూ అప్పటి అధికార పార్టీకి ఎదురొడ్డి నిలబడటంలో ముందున్నారన్న పేరు సంపాదించారు.
లెక్కలు పక్కాగా...
మామూలుగా శిద్ధారాఘవరావు కుటుంబం పార్టీలో ఉండి గెలిచి ఉంటే వైశ్య సామాజికవర్గం కోటా కింద మంత్రి పదవి వాళ్లు ఎగరేసుకుపోయేవారు. అదే టీజీ భరత్ కు ఒకరకంగా కలసి వచ్చింది. పారిశ్రామికంగా, ఆర్థికంగా, సామాజికవర్గం పరంగా టీజీ భరత్ కు కేబినెట్ లో చోటు దక్కే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో ఒక రెడ్డి సామాజికవర్గం నేత లేదా మైనారిటీ నేతతో పాటు టీజీ భరత్ పేరు కూడా అమరావతి లో మోగుతుండటంతో ఆయన కు కేబినెట్ బెర్త్ ఖాయమయినట్లేనని చెబుతున్నారు. ఇటు తండ్రి పరోక్ష అండ.. అటు సామాజికవర్గం.. మరో వైపు లోకేష్ టీం లో ఉండటం కూడా ఆయనకు కలసి వచ్చే అంశమని లెక్కలు పక్కాగా చెబుతున్నాయి. మరి కేబినెట్ లో ఆయనకు స్థానం దక్కుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story