Tue Dec 24 2024 02:46:46 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : ఏపీలో పల్లెలకు సొబగులు.. పవన్ ఆలోచన మామూలుగా లేదుగా
కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీలలో డెవలెప్మెంట్ కు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తక్షణం తొలిగించేందుకు సిద్ధమయింది
కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీలలో డెవలెప్మెంట్ కు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తక్షణం తొలిగించేందుకు సిద్ధమయింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అందించే నరేగా నిధులతో ఉపాధి హామీ పనులు చేపట్టి సత్వరం గ్రామాల్లో కొన్నేళ్లుగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి దిశగా అడుగులు వేస్తుంది. కనీస సౌకర్యాలు లేని పల్లెల్లో వసతులు కల్పించడమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది.
ఉపాధి హామీ పనులతో...
ప్రధానంగా ఉపాధి హామీ పనులతో గ్రామాలకు కొత్త సొబగులు అద్దేదందుకు సిద్ధమయింది. పక్కా ప్రణాళికతో ముందుకు వెళితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని విశ్వసిస్తుంది. ప్రధానంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి పవన్ కల్యాణ్ చొరవతో ఈ ముందడుగు పడిందనే చెప్పాలి. పల్లెలు అభివృద్ధి చెందితే అన్ని రకాల డెవలెప్మెంట్ ఉంటుందని భావించిన పవన్ కల్యాణ్ గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.
ఒకే రోజు రాష్ట్రమంతటా...
ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో 13,326 గ్రామ పంచాయతీల్లో ఈ గ్రామ సభలు మొదలు కానున్నాయి . ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తుండగా, పవన్ కల్యాణ్ అన్నమయ్య జిల్లాకు చేరుకున్నారు. దీనికి స్వర్ణ గ్రామ పంచాయతీగా నామకరణం చేశారు. ఈ గ్రామ సభలకు సర్పంచ్ లు అధ్యక్షత వహిస్తారు. ఈ గ్రామ సభల్లో నాలుగు అంశాలపై చర్చించనున్నారు. గ్రామాల్లో మరుగుదొడ్లు, విద్యుత్తు సౌకర్యం, మంచినీటి కుళాయిల ఏర్పాటు వంటివి చేయడం ముఖ్యమైనది. వంటగ్యాస్ కనెక్షన్ల అంశంపై కూడా చర్చిస్తారు.
రోడ్ల నిర్మాణం...
తర్వాత గ్రామాల్లో దోమల బెడదను నివారించడానికి డ్రైనేజీ వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేయడంతో పాటు వీథి దీపాలు, సిమెంట్ రోడ్ల నిర్మాణంపై కూడా చర్చించనున్నారు. ఇక గ్రామాల్లో రహదారుల నిర్మాణంతో పాటు మండల కేంద్రాలకు గ్రామాల నుంచి లింక్ రోడ్డు అంశంపై కూడా గ్రామసభల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. తర్వాత ఇంకుడు గుంతలు, పంటకుంటల నిర్మాణంతో పాటు పశువుల పెంపకం, షెడ్ల నిర్మాణాకి కూడా నిధులు వెచ్చించనున్నారు. దేశంలోనే తొలిసారిగా ఒకే సారి 13,326 గ్రామ పంచాయతీల్లో ఇదే రికార్డు అని చెబుతున్నారు.
Next Story