Sat Nov 23 2024 03:57:19 GMT+0000 (Coordinated Universal Time)
సార్ ప్లీజ్.. మా నాన్నకు బుద్ధి చెప్పండి : పోలీసులకు చిన్నారి విజ్ఞప్తి
మా నాన్న రోజూ తాగి వచ్చి అమ్మను కొడుతున్నాడు. ఎంత బ్రతిమిలాడినా వినట్లేదు. మీరే నాన్నకు బుద్ధి చెప్పాలని కోరాడు. రహీమ్..
పిల్లల ముందు తల్లిదండ్రులు ప్రవర్తించే తీరుని బట్టే.. వారి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. తన తండ్రి రోజూ తాగివచ్చి తల్లిని కొడుతుండటం తట్టుకోలేక పోయిన ఓ బాలుడు.. తన తండ్రికి బుద్ధి చెప్పాలని కోరుతూ ఏకంగా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కర్లపాలెం మండలం ఇస్లాంపేట పోలీస్ స్టేషన్ తొమ్మిదేళ్ల రహీమ్ వెళ్లాడు. స్టేషన్లో రహీమ్ ను చూసిన ఎస్సై శివయ్య.. ఏం జరిగింది ? ఎందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చావు అని ప్రశ్నించాడు. దాంతో తన తండ్రిపై కంప్లైంట్ చేసేందుకు వచ్చానంటూ రహీమ్ ఎలాంటి జంకూగొంకూ లేకుండా ప్రతిరోజూ వాళ్లింట్లో జరిగే తంతు గురించి ఎస్సైకి వివరించాడు.
మా నాన్న రోజూ తాగి వచ్చి అమ్మను కొడుతున్నాడు. ఎంత బ్రతిమిలాడినా వినట్లేదు. మీరే నాన్నకు బుద్ధి చెప్పాలని కోరాడు. రహీమ్ తల్లిదండ్రులు సుభాని, సుభాంబీ. సుభాని స్థానిక రైస్ మిల్ లో పనిచేస్తూనే.. ఇంట్లో మిషన్ కూడా కుడతాడు. తాగుడుకి బానిసైన సుభానీ.. ప్రతిరోజూ తాగి వచ్చి ఇంట్లో నానా గొడవ చేసి సుభాంబీని కొడుతున్నాడు. అమ్మను కొట్టొద్దని ఎంత బ్రతిమిలాడినా వినకపోవడంతో రహీమ్ తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన ఎస్సై శివయ్య బాలుడి తల్లిదండ్రులను పిలిపించి గట్టిగా మందలించారు. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి.. మళ్లీ గొడవ పడినా భార్యను కొట్టినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సుభానీని హెచ్చరించారు.
Next Story