Thu Dec 19 2024 14:51:55 GMT+0000 (Coordinated Universal Time)
కార్ల ర్యాలీకి అనుమతి లేదు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు, ఐటీ ఉద్యోగులు ఆదివారం నాడు కార్ల ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ఈ ర్యాలీని నిర్వహించనున్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వీటిపై స్పందించిన విజయవాడ సీపీ కాంతిరాణ ఈ కార్ల ర్యాలీకి ఎటువంటి పర్మిషన్ లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ర్యాలీలు, ప్రదర్శనలకు ఎలాంటి పర్మిషన్లు లేవని సీపీ తెలిపారు. కొందరు కార్ల ర్యాలీ నిర్వహించాలని అనుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిసిందన్న సీపీ, ర్యాలీ నిర్వహిస్తే మాత్రం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదన్నారు.
ఇక తెలంగాణ బోర్డర్ వద్ద భారీగా పోలీసుల మొహరించారు. హైదరాబాద్ వైపు నుంచి వస్తోన్న వాహానాలను తనిఖీ చేస్తున్నారు. టీడీపీ నేతలు, ఐటీ కంపెనీ ఉద్యోగులు ఆదివారం తలపెట్టిన ‘చలో రాజమండ్రి’ కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు వద్ద హైఅలర్ట్ ప్రకటించారు. ఈ ఆందోళనకు అనుమతి లేదంటూ వారిని సరిహద్దు వద్ద అడ్డుకునేందుకు పోలీసు సిబ్బందిని మోహరించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ డీసీసీ అనిత, నందిగామ ఏసీపీలు ప్రత్యేక దృష్టి పెట్టారు. నేడు చంద్రబాబు నాయుడును రెండో రోజు సీఐడీ అధికారులు విచారించనున్నారు.
Next Story