Mon Dec 23 2024 06:03:32 GMT+0000 (Coordinated Universal Time)
ఆ గ్రామాల్లో వింతశబ్దాలు.. భయం గుప్పిట్లో ప్రజలు
చిత్తూరు జిల్లాలోని పలు గ్రామాల్లో వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ శబ్దాలేమిటో తెలియక గ్రామస్తులు భయంతో వణిపోతున్నారు.
చిత్తూరు జిల్లాలోని పలు గ్రామాల్లో కొంతకాలంగా వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ శబ్దాలేమిటో అంతుచిక్కని గ్రామస్తులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాలోని పలమనేరు, బైరెడ్డిపల్లి మండలాలను ఆనుకుని కౌండిన్య అటవీప్రాంతం విస్తరించి ఉంది. ఆ అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న పలమనేరు మండలం నలగాంపల్లి, సంబార్ పూర్, కరిడిమొడుగు గ్రామాలతో పాటు నల్లగుట్టపల్లి, ఎస్సీ కాలనీ, ఓటేరుపాళెం, తిమ్మయ్యగారిపల్లి గ్రామాల్లో వింత శబ్దాలు వస్తున్నట్టు ప్రజలు చెప్తున్నారు.
భూమి అదురుతున్నట్లు...
అలా వింత శబ్దాలే కాకుండా అప్పుడప్పుడు భూమి అదురుతున్నట్లు కూడా ఉంటుందని, ఫలితంగా తాము నివసిస్తున్న ఇళ్లల్లో గోడలు బీటలు వారుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ శబ్దాలకు కళ్లు తిరిగినట్లవుతుందని తెలపారు. కొందరైతే ఆ శబ్దాలను భరించలేక.. ఇళ్లు వదిలి ఊరు బయట ఉన్న గుట్టలపైకి చేరుకుని రాత్రంతా అక్కడే ఉన్నట్లు సమాచారం. దీనిపై ఓ వాదన కూడా ఉంది. కౌండిన్య అటవీ ప్రాంతం చుట్టుపక్కల భూగర్భ జలాలు ఇంకిపోవడంతో.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మళ్లీ ఆ జలాలు పైకి ఉబుకుతుండటంతోనే ఈ శబ్దాలు వినిపిస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ.. అసలు అక్కడ అలాంటి శబ్దాలు ఎందుకొస్తున్నాయో నిపుణులు పరిశీలిస్తే గాని తెలియరావన్నది స్థానికుల నమ్మకం.
Next Story