Fri Nov 22 2024 15:56:01 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : సీన్ రివర్స్.. కర్మ రిటర్న్ అంటే ఇదేనేమో..? నాడు టీడీపీకి.. నేడు వైసీపీకి.. ఒక్కరూ రావడం లేదుగా?
వైసీపీ లో ఒక్కనేత బయటకు రావడం లేదు. ఐదేళ్లు పదవులు అనుభవించిన వారు ఇప్పుడు కనిపించడం లేదు.
వైసీపీ లో ఒక్కనేత బయటకు రావడం లేదు. ఐదేళ్లు పదవులు అనుభవించిన వారు ఇప్పుడు కనిపించడం లేదు. ఫలితాలు వచ్చి కొద్ది రోజులే కావడంతో ఇంకా బయటకు రాకపోవచ్చన్న ఒక వాదన వినిపిస్తున్నప్పటికీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూలగొట్టినా ఒకరిద్దరు నేతలు తప్ప ఎవరూ స్పందించకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి అద్దం పడుతుంది. అధికారంలోకి రాకపోతే ఎవరికైనా ఇంతే పరిస్థితి అని అర్ధమవతుంది. నాడు తెలుగుదేశం పార్టీ పరిస్థిితి కూడా ఇంతే ఉంది. ఇప్పుడు వైసీపీకి అదే పరిస్థితి తలెత్తింది. అధికారంలో లేకపోవడంతో నేతలు కూడా మనకెందుకొచ్చిన పీకులాట అని ఎవరూ పెద్దగా గొంతు విప్పడానికి కూడా సాహసించే ప్రయత్నం చేయడం లేదు.
ఒక్కరూ బయటకు రాకపోవడంతో...
2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి చెందిన ఒక్కనేత కూడాబయటకు రాలేదు. అప్పుడు కూడా ఒకరిద్దరు నేతలు మినహా ఎవరూ బయటకు రాలేదు. దాదాపు మూడున్నరేళ్లు అసలు బయటకు రావడానికే నేతలు భయపడ్డారు. బయటకు వచ్చిన నేతలపై నాటి వైసీపీ ప్రభుత్వం కేసులు పెడుతుండటంతో మిగిలిన వారు దూరమయ్యారు. అంతెందుకు 2019 ఎన్నికలలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో నలుగురు వైసీపీ మద్దతుదారులుగా మారిపోయిన మిగిలిన పద్దెనిమిది మందిలో ఒకరిద్దరు మినహా ఎవరూ బయటకు రాలేదు. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం ఊరుకోలేదు. బయటకు వచ్చి తాను ఉన్నానంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చినా ఎవరూ అంత సాహసం చేయలేకపోయారు.
మూడేళ్లకు పైగానే...
పార్టీని గాడిలో పెట్టడానికి చంద్రబాబుకు దాదాపు మూడేళ్లుకు పైగానే పట్టింది. ఒంగోలులో జరిగిన మహానాడు తర్వాతనే నేతలు బయటకు వచ్చి తమ నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా నిలిచారు. చంద్రబాబు ఇచ్చిన ధైర్యం, వరసగా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సమావేశాలతో పార్టీ ఒక దారిన పడింది. కార్యకర్తలు వస్తున్నా నేతలు మాత్రం ఓటమి నుంచి బయటకు రావడానికి దాదాపు మూడున్నరేళ్లు పట్టిందంటే అతిశయోక్తి కాదు. చాలా మంది ఇతర ప్రాంతాలైన హైదరాబాద్, బెంగళూరు, మద్రాస్ వెళ్లి తమ వ్యాపారాలు చూసుకున్నారు తప్పించి పార్టీ క్యాడర్ కు నేతలు అండగా నిలిచిన వారు అతి కొద్ది మాత్రమేనని చెప్పాలి. చంద్రబాబు నేతలను ఒక దారికి తేవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరకు గట్టిగా వార్నింగ్ లు ఇస్తే తప్ప బయటకు రాలేదు.
ఈరోజు వైసీపీ కూడా...
ఇప్పుడు వైసీపీ కూడా అదే పరిస్థితి. జగన్ తప్ప ఎవరూ బయటకు రాలేదు.పేర్నినాని, గుడివాడ అమర్నాధ్ వంటి నేతలు మాత్రం బయటకు వస్తున్నారు. నేతలు పూర్తిగా నైరాశ్యంలో ఉన్నట్లే కనిపిస్తుంది. ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయిలో తనకార్యక్రమాలు ప్రారంభించలేదు కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళనలు చేపట్టేందుకు ఇది సమయం కాదన్నది కొందరి నేతల వాదన అయినప్పటికీ కనీసం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చడంతోనైనా బయటకు రాకుండా ఉండటం ఎంతవరకూ సబబని క్యాడర్ ప్రశ్నిస్తుంది. గత ఎన్నికల్లో టిక్కెట్లు పొంది గెలుపొందితే అధికారాన్ని ఎంజాయ్ చేసేవారని, అదే గెలవకపోయినంత మాత్రాన క్యాడర్ ను మర్చిపోతే ఎలా అంటూ అనేక మంది సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. జగన్ ఆరు నెలల తర్వాత అంటే డిసెంబరు నుంచి బయటకు వస్తారని అంటున్నారు. అప్పుడేమైనా నేతలు బయటకు వచ్చే అవకాశం ఉందా? లేదా? అన్నది తేలనుంది.
Next Story