Sun Dec 22 2024 17:31:37 GMT+0000 (Coordinated Universal Time)
Kodali Nani : ఆ ఇద్దరు వైసీపీ నేతలు ఇళ్లపై దాడులు... పార్కింగ్ లో కార్లు ధ్వంసం
పోలింగ్ తర్వాత మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఫలితాల అనంతరం కూడా ఘర్షణలు పెద్దయెత్తున జరుగుతున్నాయి
పోలింగ్ తర్వాత మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఫలితాల అనంతరం కూడా ఘర్షణలు పెద్దయెత్తున జరుగుతున్నాయి. ప్రధానంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అగ్రనేతలపై మాటల దాడి చేసిన వారి ఇళ్లను టీడీపీ కార్యకర్తలు టార్గెట్ గా చేసుకున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని ఫస్ట్ లక్ష్యమయ్యారు. గుడివాడలోని కొడాలి నాని ఇంటిపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన ఇంటిపైకి కోడిగుడ్లు రాళ్లు విసిరారు. గుడివాడలో టీడీపీ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కొడాలని నాని ప్రకటించారని, దానికి కట్టుబడి రాజకీయ సన్యాసం స్వీకరించాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులను తోసుకుని మరీ వెళ్లి కార్లను ధ్వంసం చేశారు.
పోలీసులు అడ్డుకున్నా...
తెలుగు యువత నేత పొట్లూరి దర్శిత్ నేతృత్వంలో కార్యకర్తలు కొడాలి నాని ఇంటిపైకి దూసుకు వచ్చారు. అక్కడ పోలీసులు అడ్డుకున్నా ఊరుకోలేదు. దీంతో వన్ టౌన్ సీ శ్రీనివాస్ కు, తెలుగుయువత కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. గుడివాడ డౌన్ డౌన్ అంటూ ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకున్నా ఊరుకోలేదు. గుడివాడలో కొడాలి నాని కౌంట్ డౌన్ స్టార్టయిందని, ఇది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందంది అంటూ సవాళ్లు విసిరారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ కొడాలి నాని రాజకీయ సన్యాసం ప్రకటించాలని కోరారు. అక్కడే టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
గన్నవరంలోనూ...
ఇటు గన్నవరంలోనూ వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంటి వద్ద ఉద్రిక్తత కొనసాగుతుంది. పెద్దయెత్తున తెలుగు యువతకార్యకర్తలు అక్కడకు చేరుకుని వంశీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వంశీ ఇంటిపై రాళ్ల దాడి చేస్తున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించినా అక్కడి నుంచి కదలడంలేదు. పెద్దయెత్తున అక్కడ సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు పోలీసులు మొహరించారు. అయినా అక్కడి నుంచి తెలుగు యువత కార్యకర్తలు కదలడం లేదు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి పోలీసులు భారీగా తరలి వచ్చారు. మొత్తం మీద అటు గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలోని వల్లభనేని వంశీ ఇంటివద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
Next Story