Mon Nov 25 2024 22:56:19 GMT+0000 (Coordinated Universal Time)
మూడు నెలలూ మరింత రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. మరో మూడు నెలల పాటు రద్దీ ఎక్కువగా ఉంటుందని టీటీడీ అంచనా వేస్తుంది
తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. మరో మూడు నెలల పాటు రద్దీ ఎక్కువగా ఉంటుందని టీటీడీ అంచనా వేస్తుంది. వేసవి సెలవులు కావడం, విద్యార్థులకు పరీక్షలు పూర్తయితే రద్దీ ఎక్కువవుతుందని భావిస్తుంది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది. ప్రజాప్రతినిధులెవరూ సిఫార్సు లేఖలు ఇవ్వవద్దంటూ టీటీడీ విజ్ఞప్తి చేయడం విశేషం. ఈ మూడు నెలల పాటు తిరుమల కొండపై రద్దీ అత్యధికంగా ఉంటుందన్న అంచనాలతో టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. తిరుమలలో కేవలం నలభై వేల మందికి మాత్రమే వసతి సౌకర్యం కల్పించే వీలున్నందున ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు ఇవ్వవద్దని పేర్కొంది.
18 గంటలు...
మరోవైపు ఈరోజు కూడా తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యా కాంప్లెక్స్‌లోని పదమూడు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటలకు సర్వదర్శనం టోకెన్లు లేకుండా క్యూ లైన్లోకి ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పద్ధెనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల శీఘ్రదర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 67,886 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 29,107 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.56 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story