Fri Apr 11 2025 11:09:28 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : రాజ్యసభ సభ్యులుగా వైసీపీలో ఉండేది ఇక వాళ్లేనా? ఉండేది ఆ నలుగురేనా?
వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. వరసగా రాజీనామాలు చేస్తున్నారు

వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. అధికారం కోల్పోయిన 2024 లో 11 మంది వరకూ ఉన్న రాజ్యసభ సభ్యుల సంఖ్య ఇప్పుడు ఏడుకు చేరింది. నలుగురు సభ్యులు పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇందులో తిరిగి ఇద్దరు తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య, విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయగా అందులో బీద రవిచంద్ర టీడీపీ నుంచి, ఆర్. కృష్ణయ్య బీజేపీ నుంచి తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే ఉండటం, కూటమి పార్టీలకు అత్యధిక స్థానాలు ఉండటంతో రాజ్యసభ పదవి ఖాళీ అయితే అది కూటమి పార్టీల ఖాతాల్లో పడుతుంది.
ఆరు మాత్రమే అనధికారికంగా...
అయితే అధికారికంగా మనకు చూపుతున్న లెక్కలు ప్రస్తుతం వైసీపీకి ఏడుగురు సభ్యులు ఉన్నారని మాత్రమే కానీ, అనధికారికంగా ఆరు మాత్రమే లెక్కలు వేసుకోవాలి. వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాధరెడ్డి, ఎస్. నిరంజన్ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీలు ఉన్నారు. పరిమళ్ నత్వానీ పేరుకు వైసీపీ రాజ్యసభ సభ్యుడే అయినప్పటికీ ఆయన అదానీకి అత్యంత సన్నిహితుడు కావడంతో రాజ్యసభలో బీజేపీకి మద్దతుగా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే అనధికారికంగా ఆరుగురు రాజ్యసభ సభ్యులు మాత్రమే వైసీపీ విప్ ప్రకారం రాజ్యసభలో వ్యవహరించే అవకాశముంది.
ఆ నలుగురేనా?
అయితే వీరిలో పార్టీకి గట్టిగా ఉండేది నలుగురే కనిపిస్తున్నారు. అందులో వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, నిరంజన్ రెడ్డిలు మాత్రమే కొనసాగే అవకాశాలున్నాయని పార్టీ నేతలే లెక్కలు వేసుకుంటున్నారు. వైవీ సుబ్బారెడ్డి పార్టీ అధినేత వైఎస్ జగన్ కు బాబాయి కావడంతో ఆయన పార్టీని వీడే అవకాశాలు లేవన్న అంచనా ఉంది. అలాగే గొల్ల బాబూరావు కూడా తొలి నుంచి జగన్ కు ఆత్మీయుడు కావడంతో ఆయన కూడా వెళ్లే అవకాశాలు లేవు. ఆయన ఇటీవల తాను పార్టీని వీడేది లేదని చెప్పారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ సయితం జగన్ కు అత్యంత సన్నిహితుడు. నమ్మకస్థుడు. ఆయన పార్టీ మారే అవకాశం లేదంటున్నారు. నిరంజన్ రెడ్డి న్యాయవాది కావడంతో ఆయన పార్టీని వీడే అవకాశాలు లేవు. జగన్ కేసులన్నీ ఆయనే చూస్తారు.
ఈ ఇద్దరి విషయంలో...
ఆళ్ల అయోధ్య రామిరెడ్డి విషయంలో అనేక అనుమానాలున్నాయి. ఎందుకంటే ఆయన పారిశ్రామికవేత్త. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీతో సహజంగా వైరం పెంచుకోరు. అది తన వ్యాపారాలకు మంచిది కాదన్నది ఆయనకు తెలుసు. అందుకే ఇటీవల విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన వెంటనే అయోధ్యరామిరెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. కానీ ఆయన దావోస్ పర్యటనలో ఉండటంతో అది ప్రచారమని తేలినా తర్వాత పార్టీని వీడేది ఆయనే అయిఉండవచ్చన్న నమ్మకం కూడా పార్టీ నేతల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మేడా రఘునాధరెడ్డి పదవీ కాలం 2030 వరకూ ఉంది. ఆయన కూడా పార్టీలో ఉండే అవకాశాలు లేవంటున్నారు. మొత్తం మీద ఏపీలో సూపర్ సిక్స్ హామీల అమలు ఏమో కానీ సూపర్ సిక్స్ మాత్రం రాజ్యసభ సభ్యుల విషయంలో వర్కవుట్ అవుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డిల పదవీకాల మాత్రం 2030 వరకూ ఉంది. మిగిలినవారిలో వచ్చే ఏడాది కూడా వారి పదవీ కాలం పూర్తవుతుంది.
Next Story