Wed Dec 25 2024 13:18:22 GMT+0000 (Coordinated Universal Time)
Cyclone Effect : భయం గుప్పిట్లో ఆ జిల్లాలు.. తుపాను ముంచుకొస్తుందా?
తుపాను హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తుచర్యలు ప్రారంభించారు.
తుపాను హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు ఈ తుపాను కారణంగా బాగా ఎఫెక్ట్ అవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బలమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు.. అంటే కుండపోత వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పదిహేను రోజుల్లో కురవాల్సిన వర్షం ఒక్క గంటలో కురిసే అవకాశముందని తెలిపింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రేపు నెల్లూరు - చెన్నై మధ్య తుపాను తీరం దాటనుండటంతో బలమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురుస్తుందని తెలపడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తిరుమలలోనూ చర్యలు...
ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందస్తు చర్యలు ప్రారంభించారు. శ్రీవారి మెట్లను ఈరోజు రాత్రి నుంచి మూసివేస్తున్నారు. నడక మార్గం నుంచి భక్తులు ఎవరూ ఈరోజు రాత్రి నుంచి భక్తులు ఎవరూ రాకుండా నిషేధం విధించారు. అలాగే శిలాతోరణం, పాపవినాశనం వంటి ప్రాంతాల్లో కూడా ఎవరినీ అనుమతించడం లేదు. వాటిని మూసివేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాలకు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఈవో శ్యామల రావు ప్రకటించారు. తిరుమలకు వచ్చే భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే అవకాశముందని వాటినుంచి భక్తులు తమకు తామే కాపాడుకోవాలని ఆయన కోరారు.
ఆర్టీసీ బస్సులు రద్దు...
నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ను అధికారులు ప్రకటించారు. అధికారులు ఈరోజు రాత్రి గడిస్తే చాలు అన్న భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఈరోజు తెల్లవారు జామున తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతున్నారు. కొన్ని రైళ్లను రద్దు చేశారు. ఆర్టీసీ బస్సులను కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్లకుండా నిలిపివేశారు. వాగులు, వంకల్లో దాటాల్సిన ప్రాంతాలకు బస్సులను పంపడం లేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇక లోతట్టు ప్రాంత ప్రజలు ఈ రాత్రికి అప్రమత్తంగా ఉండాలని మైకుల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదే సమయంలో తీర ప్రాంత ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు.
Next Story