Tue Nov 05 2024 15:38:20 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేడు అన్నా క్యాంటిన్లు ప్రారంభం.. పేదవాడి కడుపు నింపడమే ప్రభుత్వ ధ్యేయం
ఆంధ్రప్రదేశ్ లో పేదవాడికి పట్టెడన్నం అందించేందుకు ప్రభుత్వం అన్నా క్యాంటిన్లను అందుబాటులోకి నేటి నుంచి తెస్తోంది
స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో పేదవాడికి పట్టెడన్నం అందించేందుకు ప్రభుత్వం అన్నా క్యాంటిన్లను అందుబాటులోకి నేటి నుంచి తెస్తోంది. ఐదు రూపాయలకే టిఫిన్, భోజనం అందిస్తుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి వేళ కూడా భోజనం అందించనున్నారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుుడు గుడివాడలో అన్నా క్యాంటిన్లను ప్రారంభించనున్నారు. సోమ వారం నుంచి శని వారం వరకూ మెనూను కూడా సిద్ధం చేశారు. రోజుకు ఒక రకమైన టిఫిన్, భోజనాన్ని అతి తక్కువ ఖర్చుకే అందిస్తున్నారు.
అక్షయ పాత్ర ఫౌండేషన్...
రాష్ట్ర ప్రభుత్వం అక్షయ పాత్ర ఫౌండేషన్ కు భోజనం, టిఫిన్ సరఫరా చేసే బాధ్యతను అప్పగించింది. భోజనంలో కూరతో పాటు పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి ఉంటాయి. అలాగే టిఫిన్ లో పూరీ కూర్మా, లేదా ఇడ్లీ చట్నీ, సాంబారు వడ్డిస్తారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలుత అన్నా క్యాంటిన్ల పునరుద్ధరణపైనే సంతకం చేశారు. ఈరోజు ఆయన గుడివాడలో అన్నా క్యాంటిన్ను లాంఛనంగా ప్రారంభిస్తారు. రేపు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటిన్లను ప్రారంభిస్తారు.
వేళలివిీ....
పేదవాడికి అతి తక్కువ సొమ్ముతో అందించేలా ఈ అన్నా క్యాంటిన్లను అందుబాటులోకి ప్రభుత్వం తెస్తోంది. దాదాపు 250 క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. వివిధ నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో అన్నా క్యాంటిన్ల కోసం ప్రత్యేకంగా చిన్న పాటి కట్టడాన్ని నిర్మించారు. రానున్న కాలంలో వీటి సంఖ్యను మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క ఆదివారం మినహా మిగిలిన ఆరు రోజులు అన్నా క్యాంటిన్లలో టిఫిన్, భోజనం అందుబాటులో ఉండనుంది. టిఫిన్ ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకూ, మధ్యాహ్న భోజనం 12.30 నుంచి 3 గంటల వరకూ, రాత్రి భోజనం 7.30 నుంచి 9 గంటల వరకూ అన్నా క్యాంటిన్లలో అందుబాటులో ఉంటాయి.
Next Story