Mon Dec 23 2024 07:32:32 GMT+0000 (Coordinated Universal Time)
ఊహించని ట్విస్ట్.. తిరుమలలో కనిపించిన మరో చిరుత
ఇవాళ బోనులో చిక్కిన చిరుత చాలా దూకుడుగా.. చాలా పెద్దదిగా ఉంది. ఇది ఆడ చిరుతగా చెప్తున్నారు.
తిరుమలలో మరో చిరుత కనిపించడంతో మళ్లీ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అలిపిరి నడక మార్గంలో నామాల గవి ప్రాంతంలో వెళ్తున్న భక్తులకు చిరుత కనిపించడంతో వారు కేకలు వేసి పరుగులు తీశారు. దీంతో చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది. సోమవారం ఉదయమే ఒక చిరుత బోనుకు చిక్కగా టీటీడీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా మరో చిరుత కనిపించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన భక్తుల్లో నెలకొంది. బోనులో చిక్కిన చిరుత పిల్లలే సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
చిన్నారి లక్షితపై దాడి చేసి చంపిన చిరుత చిక్కిందని ఫారెస్ట్ అధికారులు సోమవారం ఉదయం ప్రకటించారు. బాలిక మరణించిన ప్రదేశానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుతపులి దొరికింది. బోనులో పడిన చిరుత పెద్దదిగా అటవీ అధికారులు గుర్తించారు. బాలిక మృతిచెందిన ప్రదేశంతోపాటు చుట్టుపక్కల మూడు బోన్లతోపాటు సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కిందని అధికారులు తెలిపారు. చిరుతను తిరుపతి ఎస్వీ జూపార్క్కు తరలిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. బోనులో చిక్కే క్రమంలో అది స్వల్పంగా గాయపడిందని, ఎస్వీ జూపార్కులో చికిత్స అందిస్తామన్నారు. అనంతరం అది మ్యాన్ ఈటర్ అవునా కాదా అనేదానిపై పరీక్షలు చేస్తామని అన్నారు. ఇవాళ బోనులో చిక్కిన చిరుత చాలా దూకుడుగా.. పెద్దదిగానూ ఉంది. ఇది ఆడ చిరుతగా చెప్తున్నారు. దాడి చేసింది ఇదేనా లేదంటే మరొకటా అనేది తేల్చేందుకు ఇంకొన్ని రోజులు బోన్లు ఉంచనున్నారు అధికారులు.
Next Story