Sat Nov 23 2024 02:04:46 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh Cabinet : లాబీయింగ్ తో నేతల పాట్లు.. ఆ పోస్టు దక్కించుకునేందుకు ఫీట్లు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఈ నెల 12న చంంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఈ నెల 12వ తేదీన చంంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ మంత్రి వర్గంలో మరొకరికి చోటు కల్పించే అవకాశముంది. మొత్తం 25 మందికి కేబినెట్ లో ఛాన్స్ ఇవ్వొచ్చు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఆ ఒక్క పోస్టును ఖాళీగా ఉంచారు. ఆ ఒక్క పోస్టు కోసం ఇప్పుడు బలమైన లాబీయింగ్ పనిచేస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే తన మంత్రివర్గంలో సీనియర్ నేతలను చంద్రబాబు పక్కన పెట్టారు. యువ నేతలతో కేబినెట్ ను నింపారు. 24 మంది మంత్రులలో పదిహేడు మంది యువకులు కావడంతో మంత్రి వర్గం కొత్త తరహాలో కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో మూడుసార్లు ఎప్పుడూ ఇలా కేబినెట్ కూర్పు జరపలేదు.
ఒక్కస్థానాన్ని...
కానీ ఈసారి మాత్రం కొంత విభిన్నమైన తీరులోనే ఆయన కేబినెట్ ను ఏర్పాటు చేసుకున్నారు. నమ్మకమైన వారికి పదవులు ఇవ్వడంతో పాటు అదే సమయంలో భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటున్నారు. అయితే ఎవరూ ఇప్పుడు అసంతృప్తి చేసే సాహసం చేయరు. ఎందుకంటే 164 మంది శాసనసభ్యులతో కూటమి ప్రభుత్వం బలంగా ఉండి. డిమాండ్ చేసే పరిస్థితి ఎవరికీ లేదు. అదే సమయంలో లాబీయింగ్ చేసుకోవడానికి మాత్రం చంద్రబాబు ఒకే ఒక అవకాశాన్ని కల్పించారు. అది కూడా ఒక్క స్థానాన్ని ఖాళీగా ఉంచారు. అది ఎవరికోసం అన్న చర్చ పలు రకాలుగా జరుగుతుంది. అయితే ఈ స్థానం దక్కించుకునేందుక అనేక మంది ఇప్పటికే తమ ప్రయత్నాలను ప్రారంభించారు. మరికొందరు పని అయ్యే రూట్లలో నరుక్కు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
బీజేపీ ఒకే అంటేనే...
ప్రధానంగా బీజేపీకి ఈసారి ఒక్క మంత్రి పదవే ఇవ్వడంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచిన సుజనా చౌదరి ఈ పోస్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు వరకూ సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉండేవారు. 2014లో టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉండి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుజనా చౌదరి బీజేపీలోకి వెళ్లిపోయారు. బీజేపీ నుంచి గెలవడంతో రాష్ట్ర కేబినెట్ లో స్థానం కోసం చేసిన తొలి ప్రయత్నం ఫలించలేదు. సత్యకుమార్ యాదవ్ వైపు బీజేపీ అధినాయకత్వం మొగ్గు చూపడంతో ఆయన ఏమీ చేయలేకపోయారు. అయితే బీజేపీ పెద్దలను ఒప్పించే ప్రయత్నంలో సుజనా చౌదరి ఉన్నట్లు అమరావతి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
బాబు ముందుకు...
అదే నిజమైతే ఆ ఒక్కటీ సుజనా చౌదరికి దక్కడం ఖాయం. ఎందుకంటే కృష్ణా జిల్లాలో రెండు మంత్రి పదవులు మాత్రమే దక్కాయి. ఒకటి కొల్లు రవీంద్ర, రెండోది పార్థసారధి. మూడో మంత్రి పదవి కోసం ఆయన ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఇక ఈ ఒక్క పోస్టు కోసం క్షత్రియ సామాజికవర్గం నుంచి కూడా తమకు కావాలని డిమాండ్ వినపడుతుంది. ఈ ఎన్నికల్లో క్షత్రియులలో 90 శాతం మంది కూటమి వైపు నిలవడంతో తమ సామాజికవర్గానికి న్యాయం చేయాలని ఆ సామాజికవర్గం నుంచి డిమాండ్ వినపడుతుంది. దానికి చంద్రబాబు నాయుడు సమ్మతి తెలిపితే ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుకు ఆ ఒక్క పదవి ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇవన్నీ కాకుండా ఎస్సీలకు కేటాయించాలని కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నారట. మొత్తం మీద ఆ ఒక్క పోస్టు కోసం మాత్రం విపరీతంగా లాబీయింగ్ మొదలయింది. మరి ఆ ఒక్కటి ఎవరికి దక్కుతుందన్నది చూడాల్సి ఉంది.
Next Story