Thu Dec 26 2024 23:09:26 GMT+0000 (Coordinated Universal Time)
మైనర్ పై హత్యాచారం కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు.. దోషికి ఉరిశిక్ష
బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి నిందితుడ్ని వెతికి పట్టుకున్నారు. విచారణలో అతడే..
ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసిన కేసులో నిందితుడికి ఒంగోలు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఆ కామాంధుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. 8 జులై 2021లో గిద్దలూరు మండలం అంబవరానికి చెందిన దూదేకుల సిద్దయ్య.. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న కూతురి వరుసయ్యే బాలికను తన ఇంట్లోకి పిలిచి అత్యాచారానికి యత్నించాడు. బాలిక భయంతో కేకలు పెట్టడంతో.. సిద్దయ్య బాలికను మంచానికేసి కొట్టాడు. స్పృహ కోల్పోయిన బాలికపై అత్యాచారం చేశాడు. చిన్నారి మరణించడంతో.. ఆమె మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ సంచిలో చుట్టి సైకిల్ పై తీసుకెళ్లి గ్రామ శివారులోని తుప్పల్లో పడేసి పరారయ్యాడు.
బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి నిందితుడ్ని వెతికి పట్టుకున్నారు. విచారణలో అతడే నిందితుడని నిర్థారణ అవడంతో.. ఒంగోలు రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, పోక్సో కోర్టు న్యాయమూర్తి (ఇన్చార్జ్) ఎంఏ సోమశేఖర్ మరణశిక్ష (చనిపోయేంత వరకు ఉరి) విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే బాధిత బాలిక తల్లిదండ్రులకు రూ.10లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. హత్యాచారం కేసులో 18 నెలల్లోనే దోషికి శిక్ష పడినట్టు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు. ఈ కేసు విచారణలో ప్రతిభ కనబరిచిన అప్పటి దిశ స్టేషన్ డీఎస్పీ ధనుంజయుడు, సీఐ ఎండీ ఫిరోజ్, కోర్టు లైజన్ సిబ్బందిని ఆయన అభినందించి ప్రశంసా పత్రాలు, రివార్డులు అందించారు.
Next Story