Mon Dec 23 2024 02:34:18 GMT+0000 (Coordinated Universal Time)
TDP : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియామకం
టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు
టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఉత్వర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి దక్కడంతో పల్లా శ్రీనివాసరావుకు పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. బీసీ సామాజికవర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీని సాధించారు. ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాధ్ పై 95,235 ఓట్ల తేడాతో గెలుపొందారు.
మూడోసారి కూడా...
వరసగా మూడో సారి కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఉత్తరాంధ్రకే దక్కింది. తొలి విడత కళావెంకట్రావు ఉండగా, ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావును నియమించడంతో మూడుసార్లు ఉత్తరాంధ్రకే ఈ పదవి దక్కినట్లయింది. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా నిలుస్తానని ఆయన తెలిపారు. కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పారు.
Next Story