పవన్‌కి జగన్ అంటే ద్వేషం..! అందుకేనా..?
రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు. కానీ ఇప్పుడు శత్రువులు తయారవుతున్నారు.
రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు. కానీ ఇప్పుడు శత్రువులు తయారవుతున్నారు. ఇది నేటి ట్రెండ్. ఏపీ పాలిటిక్స్ కూడా దీనికి మినహాయింపు కాదు. రాజకీయాల్లోకి వచ్చిన ఏ నాయకుడైనా ప్రజాభిమానాన్ని పొందాలనుకుంటాడు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతాడు. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం జగన్ ఓటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. తాను గెలవకపోయినా, ముఖ్యమంత్రి కాకపోయినా ఫర్వాలేదు గానీ, జగన్ మరోసారి అధికార పీఠం చేపట్టకూడదని మొక్కవోని దీక్షతో పని చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా ‘ఎట్టి పరిస్థుతుల్లోనూ జగన్ ముఖ్యమంత్రి కాబోరు’ అని పవన్ కాన్ఫిడెంట్‌గా చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుంది.
పవన్ మాటల్లో అడుగడుగునా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే ద్వేషం కనిపిస్తుంది. అది ఏ స్థాయికి వెళ్లిందంటే ‘రుషికొండ భూమిలో జగన్ కూరుకుపోతారు’ అనే వరకూ. ప్రత్యర్థిని ఓడిరచాలనుకోవడం వేరు. భౌతికంగా ఆ మనిషి ఉనికి లేకుండా ఉండాలని కోరుకోవడం వేరు. ఇలాంటి ఆలోచనలు రాష్ట్రానికి గానీ, రాజకీయాలకు గానీ మంచిది కాదు. అసలు పవన్ జగన్‌ను ఇంతలా ద్వేషించడానికి కారణం ఏమిటి?
వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన బావమరిది, పి. రవీంద్రనాధ్‌రెడ్డి హవా బాగా కొనసాగింది. ప్రస్తుతం వైకాపా తరఫున కమలాపురం ఎమ్మెల్యే.గా ఉన్న ఆయన రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పేవారు. పవన్ సినిమాల్లో బిజీగా ఉన్న రోజుల్లో రవీంద్రనాధ్‌రెడ్డి ఓ సారి సినిమా షూటింగ్లో పవన్‌ని కలిశారు. ‘మీతో ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. డేట్లు ఇవ్వండి’ అంటూ అడిగారు. ఈ రోజుల్లో సాధారణంగా నిర్మాతలు హీరోలపట్ల వినయ విధేయతలతో ఉంటారు. అలాంటిది రవీంద్రనాధ్‌రెడ్డి తనను కాల్షీట్లు ఇమ్మని డిమాండ్ చేసేసరికి పవన్‌కి ఎక్కడో కాలింది. వైఎస్ కుటుంబంపై పవన్ ద్వేషానికి ఇది మొదటి కారణం.
2019 ఎన్నికల్లో జగన్ పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేశారు. కార్లు మార్చినట్లుగా పవన్ పెళ్లాలని మారుస్తారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ విమర్శ తనను మహిళల్లో పలుచన చేసిందని పవన్ ఫీలయ్యారు. తాను కూడా వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయగలనని, కానీ తనకు సంస్కారం ఉందని చెప్పుకొచ్చారు. కానీ అప్పటికే జనసేనకు జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.
2019 ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు చోట్లా దారుణంగా ఓడిపోడానికి జగనే వ్యక్తిగతంగా కారణమని పవన్ నమ్ముతున్నారు. ఇటీవల వారాహి యాత్రలో మాట్లాడుతూ తనను ఓడిరచడానికి 100 కోట్లు ఖర్చుపెట్టారని పవన్ వెల్ల డిరచారు. తనను కక్షగట్టి ఓడిరచారు కాబట్టి, జగన్ మీద పీకల్దాకా కోపం పెంచుకున్నారు.
జగన్ తనకు ఇచ్చిన ‘దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్’ బిరుదులు పవన్‌ను చాలా చిరాకు పెడుతున్నాయి. ఈ విషయంలో జగన్‌పై తీవ్ర అసహనంతో ఉన్నారు పవన్. ఆ కోపాన్ని తట్టుకోలేక ఓ సారి మీటింగ్‌లో చెప్పు తీసి కొడతానని చెప్పు తీసి మరీ చూపించారు. కానీ జగన్ ఆరోపణలు జనంలోకి బాగా వెళ్లిపోతున్నాయని పవన్ నమ్ముతున్నారు. జగన్ మీద ద్వేషానికి ఇది మరో కారణం. జగన్ కానీ, ఆయన పార్టీ నాయకులు కానీ పవన్‌ని వ్యక్తిగతంగా తీవ్రంగా విమర్శిస్తుంటారు. సాధారణంగా సినిమా హీరోలకు పొగడ్తలే అలవాటు. కానీ ఈ విమర్శలను, ముఖ్యంగా తనకు అసలు గిట్టని వైకాపా నుంచి వచ్చే విమర్శలను పవన్ తట్టుకోలేకపోతున్నారు.
ఇలా జగన్‌ను రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా శత్రువుగా చూడటం వల్లే జగన్ గురించి హద్దులు దాటి పవన్ విమర్శిస్తున్నారు. ఈ ద్వేష రాజకీయాలు ఎంతదాకా వెళ్తాయో చూడాలి.