Fri Dec 27 2024 07:33:25 GMT+0000 (Coordinated Universal Time)
ఆ రెండింటిలో పవన్ లక్ష్యమేంటి ? : మంత్రి అంబటి
చెప్పుల రాజకీయం చేస్తున్నది తాము కాదన్న మంత్రి అంబటి రాంబాబు.. ఇకనైనా పవన్ కల్యాణ్ ఇలాంటి రాజకీయాలు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రులు ఫైర్ అవుతున్నారు. పవన్ కల్యాణ్ చెప్పు చూపించి మాట్లాడటంపై నిన్న మాజీమంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని రివర్స్ కౌంటర్ ఇవ్వగా.. తాజాగా మంత్రి అంబటి రాంబాబు ఆ అంశంపై స్పందించారు. చెప్పులు చూపించి మాట్లాడటంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ ఒక చెప్పు చూపిస్తే.. మేం రెండు చెప్పులు చూపిస్తామని, అలాంటి వాళ్లు వైసీపీలో లేరా? అన్నారు. పవన్ ఒక చెప్పు చూపిస్తే, తమ పేర్ని నాని రెండు చెప్పులు చూపించారని.. పవన్ రెండు చూపిస్తే తాము నాలుగు చూపిస్తామని అన్నారు. ఒక రాజకీయపార్టీ అధినేతగా ఉన్న వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు పవన్ కు లేవన్నారు. చాలా సంయమనంతో ఉండాలన్నారు.
చెప్పుల రాజకీయం చేస్తున్నది తాము కాదన్న మంత్రి అంబటి రాంబాబు.. ఇకనైనా పవన్ కల్యాణ్ ఇలాంటి రాజకీయాలు మానుకోవాలన్నారు. చెప్పులు చూపించకూడదయ్యా పవన్ కల్యాణ్ అంటూ హితవు పలికారు. ఎవరి వెంటో తిరిగితే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా అవుతారని ఎద్దేవా చేశారు. దత్తపుత్రుడి మాటలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. సినిమాల్లో స్టార్ హీరోగా మంచి ఇమేజ్ ఉన్న పవన్ కల్యాణ్.. రాజకీయాల్లోకి వచ్చి కమెడియన్ అయ్యారని అంబటి అభిప్రాయపడ్డారు. సినిమాల్లో హీరోగా ఉన్న వ్యక్తి రాజకీయాల్లో కూడా హీరో కాగలరని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ లక్ష్యం సీఎం కావడమా? లేక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టడమా? అని ప్రశ్నించారు. పవన్ కు స్థిరత్వం లేదని, ఆయన రాజకీయాలకు పనికిరారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీచేసినా మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు.
Next Story