AP Politics: చంద్రన్నతో పవన్ భేటీ.. ఆ అంశంపైనే చర్చ
ఏపీలో టీడీపీ - జనసేన పొత్తు ప్రకటన తర్వాత రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణ దిశగా ముందుకు కదులుతున్నాయి.
ఏపీలో టీడీపీ - జనసేన పొత్తు ప్రకటన తర్వాత రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణ దిశగా ముందుకు కదులుతున్నాయి. ఇప్పటికే రెండు పార్టీల నుంచి ఉమ్మడి కమిటీల నియామకం జరుగగా, వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని రెండు పార్టీలు ప్రకటించాయి.అయితే రాజమండ్రిలో మొదటిసారి సమావేశమైన ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశంలో ముందుగా రెండు పార్టీలు క్షేత్ర స్థాయిలో కలవడంపై ఫోకస్ పెట్టాయి.క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల కేడర్ మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా చర్యలు చేపట్టారు. దీంతో పాటు ఉమ్మడి జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు కూడా పూర్తయ్యాయి. అన్ని జిల్లాల్లో టీడీపీ-జనసేన కలిసి సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి.
చిన్నచిన్న విభేదాలు వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. ఇలా రెండు పార్టీల మధ్య పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిన తర్వాత ప్రభుత్వంపై ఆందోళనలకు కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించాయి. అయితే ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి...?ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై చర్చించేందుకు రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించాయి. దీనికంటే ముందుగానే ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని కూడా రెండు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి.
కానీ కొన్ని కారణాల వల్ల రెండు కార్యక్రమాలు వాయిదా పడగా, నవంబర్ 1న విడుదల చేయాలని భావించినా.. ఉమ్మడి మేనిఫెస్టో, నవంబర్ 3వ తేదీన నిర్వహించాలనుకున్న ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం కూడా వాయిదా పడ్డాయి. అయితే చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడం, వైద్య పరీక్షల కోసం హైదరాబాద్కు వెళ్లారు. మరోవైపు ఇటలీ నుంచి తిరిగొచ్చిన పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. దీంతో కేవలం పరామర్శ మాత్రమే కాకుండా రాజకీయపరమైన చర్చ కూడా జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే టీడీపీ మహానాడులో ప్రకటించిన సూపర్ సిక్స్ లో కీలక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. దీనికి తోడు మరో నాలుగు ప్రతిపాదనలు జనసేన తరపున ఇచ్చారు. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల తర్వాత ప్రజల్లోకి వెళ్తామని ఇద్దరు నేతలు ప్రకటించారు. ఉమ్మడి మేనిఫెస్టోపై చంద్రబాబుతో పవన్ చర్చించినట్లు సమాచారం. తాజాగా చంద్రబాబుతో భేటీతో ఉమ్మడి మేనిఫెస్టో తో పాటు ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.