Mon Dec 23 2024 12:15:39 GMT+0000 (Coordinated Universal Time)
విజయవాడ చేరుకున్న పవన్ కల్యాణ్.. త్వరలోనే యాత్ర
పాదయాత్రకు సమానమైన యాత్ర చేపట్టే యోచనలో పవన్ ఉన్నట్లు జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు తెలిపారు
pa పవన్ కల్యాణ్ విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన విజయవాడ వచ్చారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని పవన్ నిర్వహించనున్నారు. శుక్రవారం రాత్రి విజయవాడలోనే బస చేయనున్న పవన్ శనివారం పార్టీ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళగిరిలో జరగనుంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పీఎసీ సభ్యులు, జిల్లా ఇన్చార్జులు పాల్గొంటారు. శుక్రవారం ముఖ్యనాయకులతో పవన్ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ప్రధానంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు, జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర తదితర అంశాలపై చర్చించనున్నారు.
పాదయాత్రకు సమానమైన యాత్ర చేపట్టే యోచనలో పవన్ కల్యాణ్:
పాదయాత్రకు సమానమైన యాత్ర చేపట్టే యోచనలో పవన్ ఉన్నట్లు జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ సేవలకే పరిమితమవుతానని.. వచ్చే ఎన్నికల్లో జనసేనాని పవన్‌కల్యాణ్ ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారని అన్నారు. పొత్తులపై తమ పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటారని.. ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమని నాగబాబు స్పష్టం చేశారు. జనసేన పార్టీ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తే దీటుగా సమాధానం చెబుతామని.. అదే సమయంలో జనసేనపై అసత్య ఆరోపణలు, ప్రచారాలను కూడా సహించమని కూడా ఆయన హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం అధికార మదంతో చాలా చోట్ల జన సైనికులను బెదిరింపులకు గురి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. పదవులను అడ్డం పెట్టుకుని బరి తెగించి ప్రవర్తిస్తున్న వైసీపీ నేతలకు తగిన రీతిలో గట్టిగా సమాధానం చెబుతామని నాగబాబు అన్నారు. ఉత్తరాంధ్రలో జనసేనకు బలమైన పునాదులు ఉన్నాయని, వాటిని కదిలించే సత్తా ఎవరికీ లేదని ఆయన తెలిపారు.
Next Story