కోనసీమ నీరు, తిండి, గాలిలో పౌరుషం ఉంటుంది: పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ యాత్ర రాజోలుకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక నియోజకవర్గం రాజోలు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం అమలాపురం కార్యకర్తలు, నాయకుల సమావేశంలో మాట్లాడారు. కోనసీమ నీరు, తిండి, గాలిలో పౌరుషం ఉంటుందన్నారు. ఈ నేలలో బడబాగ్ని దాగి ఉందని.. అన్యాయం, తప్పు జరిగితే ఊరుకునే తత్వం ఉండదన్నారు. మనుషుల్ని ఇక్కడి వారు ఎంతగా ప్రేమిస్తారో, అభిమానం ఎంతగా చూపుతారో, వారి కోపం కూడా అంతే తీవ్రంగా ఉంటుందని అన్నారు. పోరాటాలు ఎప్పుడు అహింసాయుత మార్గాల్లో జరగాలని చెప్పిన పవన్.. ఏ ఉద్యమమైనా హింసాయుత వాతావరణంలోకి వెళితే ఆ ఉద్యమం నీరుగారిపోతుందని అన్నారు. కోనసీమ అల్లర్లలో అమాయక యువతపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. తప్పు చేసిన వారు ఏ కులంలో ఉన్న కచ్చితంగా మూకుమ్మడిగా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే ప్రజల నుంచి ఎన్నికైన వారు కేవలం తమ కులానికే ప్రతినిధి కారని.. రేపటి రోజున ఇక్కడి నుంచి శ్రీ రాజబాబు ఎమ్మెల్యే అయితే దళిత వర్గానికి మాత్రమే కాదు అందరికీ ప్రతినిధి అవుతారన్నారు. ఎంతటి వస్తాదులైనా.. తోపులైనా ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కలిగిస్తే ప్రజల కోసం పోరాడంలో వెనక్కి తగ్గేదేలేదని చెప్పారు. అన్ని కులాలు కొట్టుకోకుండా ఐక్యతతో ముందుకు వెళ్లడమే జనసేన లక్ష్యమన్నారు.