'బ్రో' అట్టర్ ప్లాఫ్.. పవన్‌పై సినిమా తీస్తా: అంబటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన లేటెస్ట్ సినిమా "బ్రో"పై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన లేటెస్ట్ సినిమా "బ్రో"పై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఈ చిత్రం ఎలాంటి కలెక్షన్లను రాబట్టలేదని మంత్రి పేర్కొన్నారు. బ్రో సినిమా "అట్టర్ ఫ్లాఫ్" అని అభివర్ణించారు. రాంబాబు, శ్యాంబాబు పాత్రలు లేకుంటే మరో కోటి రూపాయలు రాబట్టవచ్చన్నారు. అవసరం లేకుండా శ్యాంబాబు లాంటి పాత్రల్ని పెట్టి సబ్జెక్ట్ ని పక్కదోవ పట్టించారని అన్నారు. ప్యాకేజీ కోసమే పవన్ కళ్యాణ్ సినిమాలు తీస్తున్నారని ఆరోపించారు. వారాహి అని అమ్మవారి పేరు పెట్టుకున్న వాహనంపై ఎక్కి పవన్ కల్యాణ్ ప్రసంగాలు చేస్తున్నందున.. ఆయనకు అమ్మవారి శాపం తగిలిందని, అందుకే పవన్ సినిమాలేవీ ఇక సక్సెస్ కావని వివరించారు.
అంతేకాదు త్వరలో పవన్ కళ్యాణ్ పై సినిమా తీస్తానని మంత్రి అంబటి ప్రకటించారు. సినిమాలో శ్యాంబాబు అనే చిన్న రోల్‌ని పెట్టి తనను గోడపక్కనుంచి గోకడమెందుకని మంత్రి అంబటి మండిపడ్డారు. డైరెక్ట్‌గా సంబరాల రాంబాబు అనే టైటిల్ పెట్టి తనని గోకొచ్చుకదా, అప్పుడు తాను బదులిచ్చేవాడినని అన్నారు. 'బ్రో' మూవీపై తనకేమీ కోపం లేదని, అయితే ఆ సినిమాను తలచుకుంటేనే నవ్వొస్తోందన్నారు. చివరగా తన ఫ్రెండ్స్‌తో కలసి తాను ఫుల్ లెంగ్త్ సెటైరిక్ మూవీ తీస్తున్నానంటూ కొన్ని టైటిల్స్ చదివి వినిపించారు. నలుగురు భార్యలు గుణపాఠం చెప్పేలా ఈ సినిమా నడుస్తుందని, నిత్య పెళ్లికొడుకు, పెళ్లిళ్లు - పెటాకులు, తాలి-ఎగతాళి, బాహుభార్య ప్రావీణుడు, ఎంఆర్ఓ - పెళ్లిళ్లు, బంధుత్వాలు, నేరస్తులు వంటి పలు టైటిల్స్‌ని పరిశీలిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
జర్నలిస్టులు కూడా ఈ మూవీకి సలహాలు ఇవ్వొచ్చని తెలిపారు. రాజకీయాలు, సినిమాల్లో మునిగితేలడం అపజయానికి దారి తీస్తుందని అంబటి వ్యాఖ్యానించారు. మంత్రి అంబటి సినిమా తీయాలనే కోరికను వ్యక్తం చేశారు. కథ యొక్క కొన్ని వివరాలను పంచుకున్నారు. ఇది మంచి కుటుంబ నేపథ్యం నుండి తోబుట్టువులు సెలబ్రిటీలుగా మారడం చుట్టూ తిరుగుతుందని తెలిపారు. తమది లో బడ్జెట్ మూవీ అని, ఫెయిల్ అయ్యే అవకాశమే లేదన్నారు.