Mon Dec 23 2024 08:24:57 GMT+0000 (Coordinated Universal Time)
పెడన వైసీపీలో ఇంటి పోరు
ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నాగకుమారికి మూడేళ్లపాటు పెడన చైర్పర్సన్ పదవిని ఇవ్వాలని కౌన్సిలర్ కటకం ప్రసాద్ అన్నారు.
పెడన పురపాలక సంఘంలో ఇంటి పోరు తారాస్థాయికి చేరుకుంది. చైర్పర్సన్ పదవిపై వైసీపీ నేతల మధ్య ముందుగానే డీల్ ఉండగా.. అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. రెండేళ్ల అనంతరం చైర్పర్సన్ను మార్చాలనే ఒప్పందాన్ని అమలు చేసి తీరాల్సిందేనని మంత్రి జోగి రమేష్పై ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుత చైర్పర్సన్ రాజీనామా చేయకపోవడంతో వివాదం ముదురుతోంది. మంత్రి హామీని నిలబెట్టుకోకపోతే కౌన్సిలర్లు తిరుగుబావుటా ఎగరవేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు.
అప్పట్లో పెడన పురపాలకసంఘం చైర్పర్సన్ అభ్యర్థిగా అప్పట్లో కటకం ప్రసాద్ భార్య నాగకుమారి అంటూ ప్రచారం చేశారు. పెడన పురపాలక సంఘానికి జరిగిన ఎన్నికల్లో 23 వార్డులకుగాను 21 వార్డులను వైసీపీ కైవసం చేసుకుంది. నాగకుమారికే మున్సిపల్ చెర్పర్సన్ పదవిని ఇస్తారని అప్పట్లో అందరూ ఊహించారు. కానీ బళ్లా జ్యోత్స్నరాణికి రెండేళ్లపాటు చైర్పర్సన్ పదవిని ఇచ్చారు. మిగిలిన మూడేళ్లు కటకం నాగకుమారికి ఇస్తామని ఒప్పందం కుదిర్చారు. ఈ ఒప్పందానికి నాగకుమారి, ఆమె భర్త ప్రసాద్ అంగీకరించారు. ఈ ఏడాది మార్చి 17వ తేదీతో పెడన మున్సిపల్ చైర్పర్సన్ పదవి రెండేళ్ల గడువు ముగిసింది. అప్పటి నుంచి నాగకుమారి, ఆమె భర్త ప్రసాద్ తమకు చైర్ పర్సన్ పదవి ఇవ్వాలని మంత్రి జోగి రమేష్, మాజీమంత్రి పేర్ని నానిని కోరుతూ వస్తున్నారు. రెండేళ్ల పదవీకాలం గడువు ముగిసి రెండు నెలలు గడచినా జ్యోత్స్నరాణి తన పదవికి రాజీనామా చేయలేదు.
ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నాగకుమారికి మూడేళ్లపాటు పెడన చైర్పర్సన్ పదవిని ఇవ్వాలని కౌన్సిలర్ కటకం ప్రసాద్ అన్నారు. ఎన్నికల సమయంలో ఐదేళ్లపాటు తమకే ఈ పదవిని ఇస్తామని జోగి రమేష్ హామీ ఇచ్చారని తెలిపారు. ఎన్నికల్లో పెడనలోని 23 వార్డులకు గాను 21 వార్డులను వైసీపీ కౌన్సిలర్లు గెలుచుకున్న తరువాత మాట మార్చి చైర్పర్సన్ పదవిని దూరం పెట్టారన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, మంత్రి జోగి రమేష్ల సమక్షంలో మచిలీపట్నంలో ఇటీవల జరిగిన సమావేశంలో బళ్లా జ్యోత్స్నరాణి చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తానని చెప్పి, పెడన వచ్చిన వెంటనే పదవిని వదులుకోనని ఆమె చెబుతున్నారని ఆయన అన్నారు. దీంతో త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. పెడన వైసీపీలో ఇంటి పోరు తారా స్థాయికి చేరుకుందనడానికి ఇదొక నిదర్శనం.
Next Story