Thu Nov 21 2024 21:43:42 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : పెద్దిరెడ్డి పని పట్టేందుకు సిద్ధం అవుతున్నారా? ఏ రేంజ్ లో రెడీ అవుతున్నారంటే?
కూటమి నేతలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్టెట్ అయినట్లే కనిపిస్తుంది.
అందరి లక్ష్యం ఆయనే. ఆయన టార్గెట్ గా రాబోయే రాజకీయమంతా నడుస్తుంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. శత్రువుల సంఖ్య అపారం. ఆయనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి పని పట్టేందుకు ఇప్పుడు అధికార పార్టీ నేతలంతా కాచుకూర్చుని ఉన్నారు. ఒక్కరైతే పర్లేదు. కానీ కూటమిలోని మూడు పార్టీలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి శత్రువులున్నారు. ఈ ఎన్నికల్లో మరింత పెరిగారు. దీంతో ఆయన లక్ష్యంగా అధికార పార్టీ ఎక్కుపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా సుదీర్థ రాజకీయాల నుంచి కొందరితో శత్రువులుంటే.. మరికొందరిని పార్టీ కోసం తనకు వ్యతిరేకంగా మార్చుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇప్పుడు వైఎస్ జగన్ కంటే ముందు ఆయనపై ప్రతీకారం తీర్చుకోవడమే అధికార పార్టీ నేతలకు ఫస్ట్ ప్రయారిటీగా మారనుందన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.
టీడీపీ అధినేతతో....
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో వైరం ఈనాటిది కాదు. యూనివర్సిటీ రాజకీయాల నుంచి ఇద్దరి మధ్య పొసగదు. ఇద్దరు వేర్వేరు పార్టీలో ఉంటూ తమ ఆధిపత్యం కోసం ప్రయత్నించేవారు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత చంద్రబాబును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావాలని టార్గెట్ చేశారని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ను ఓడించడానికి చేసిన ప్రయత్నమయితే కావచ్చు. అంగళ్లులో జరిగిన దాడుల విషయంలోనూ, తిరుపతి విమానాశ్రయంలో చంద్రబాబుకు జరిగిన అవమానం వెరసి పెద్దిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు నడిచేందుకు ఎక్కువగా అవకాశాలున్నాయి. ఆయన ఆర్థిక మూలాలపై కూడా దెబ్బతీసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
నల్లారి సోదరులతో...
ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, బీజేపీలో ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి అస్సలు పడదు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నించేవారు. వీరి శత్రుత్వం కూడా ఈ నాటిది కాదు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కూటమి, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో నల్లారిది పై చేయి అయింది. సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి విజయం సాధించారు. పీలేరులో కిషోర్ కుమార్ రెడ్డిని ఓడించేందుకు పెద్దిరెడ్డి ప్రయత్నించారని, రాజంపేటలో మిధున్ రెడ్డి చేతిలో ఓటమి పాలయి అవమానంతో ఉన్నారు. దీంతో నల్లారి సోదరుల ఫస్ట్ టార్గెట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాక మరెవరుంటారన్నది ఎవరిని అడిగినా చెబుతారు. చిత్తూరు జిల్లాలో తమ కుటుంబాన్ని గత ఐదేళ్లలో అణిచివేసే ప్రయత్నం చేసిన వైనాన్ని చెబుతున్నారు. నేరుగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి మరీ పెద్దిరెడ్డికి హెచ్చరికలు పంపారంటే ఏ రేంజ్ లో కసితో ఉన్నారో అర్థమవుతుంది.
పవన్ ను ఓడించేందుకు...
కూటమిలోని మరో పార్టీ జనసేన. పవన్ కల్యాణ్ కు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య మొన్నటి వరకూ రాజకీయ విభేదాలు మాత్రమే కాని వ్యక్తిగత ద్వేషాలంటూ ఏమీ లేవు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ ను ఓడించడానికి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పెద్దయెత్తున నిధులు ఖర్చుచేశారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. రాజంపేటలో ప్రచారం చేసే సమయంలోనూ పవన్ కల్యాణ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నిర్వహిస్తున్న వ్యాపారాలపై ధ్వజమెత్తారు. అక్రమ మద్యం, ఇసుక అంటూ వారిపై విమర్శలు చేశారు. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మూడు పార్టీల నుంచి శత్రువులు తయారయినట్లేనని అనుకోవాలి. ఈ ఐదేళ్లు వీరిని ఎదుర్కొనడం పెద్దిరెడ్డికి కత్తిమీద సామే అవుతుంది. ఈ సమస్య నుంచి అధిగమించాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందు ఎలాంటి ఆప్షన్లు లేవంటున్నారు. మరి పెద్దాయన ఈ ప్రమాదం నుంచి బయటపడే మార్గం గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉండాల్సిందేనంటున్నారు ఆయన సన్నిహితులు...
Next Story