Thu Dec 26 2024 22:12:18 GMT+0000 (Coordinated Universal Time)
Ap Ts Politics : కేసీఆర్ అలా..జగన్ ఇలా..సేమ్ టు సేమ్... ఎందుకిలా?
నియంతృత్వ పోకడలను ప్రజలు ఆహ్వానించరు. అంతా తామే అని భావిస్తే అది భ్రమే అవుతుంది.
నియంతృత్వ పోకడలను ప్రజలు ఆహ్వానించరు. అంతా తామే అని భావిస్తే అది భ్రమే అవుతుంది. గ్రౌండ్ లెవెల్ లో ఉండే వాస్తవ పరిస్థితులను గమనించాల్సి ఉంటుంది. ప్రజలకు చేరువగా ఉండాల్సి ఉంటుంది. ఇటు తెలంగాణలో కేసీఆర్, అటు ఏపీలో జగన్ లు ఒకరకంగా నియంతృత్వ ధోరణితోనే ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. కేసీఆర్ ప్రగతి భవన్ కే పరిమితమయి ప్రజలకు దూరంగా ఉన్నారు. ప్రజా సమస్యలు తనకు తెలుసునని, తాను పరిష్కరించేవే సమస్యలని ఆయన భావించారు. అందుకే పదేళ్ల ముఖ్యమంత్రి పదవిచేపట్టిన తర్వాత కేసీఆర్ దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానంలోనూ BRSగెలవలేకపోయింది. అంటే కేసీఆర్ నేల మీదకు చూడడని భావించి జనం ఈ ఎన్నికల్లోనూ పక్కన పెట్టినట్లయింది.
తాడేప్యాలెస్ ను దాటి...
ఇక జగన్ కూడా అంతే. సేమ్ మెంటాలిటీ. తాడేపల్లి ప్యాలెస్ ను దాటి బయటకు రాలేదు. అంతా అక్కడి నుంచే. ముఖ్యమంత్రిగా సమీక్షలు చేసినా.. సెక్రటేరియట్ కు వచ్చిన దాఖలాలు లేవు. కేవలం మంత్రివర్గ సమావేశాలకు మినహా సెక్రటేరియట్ కు రాని పరిస్థితి. తాడేపల్లి ప్యాలెస్ కు సామాన్య జనం చేరుకోలేని పరిస్థితి. ఆయనంతట ఆయన జనంలోకి వచ్చినప్పుడు మాత్రమే, కనిపించిన వారితో కొంత కరచాలనం చేయడం మినహా ప్రజాసమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అంతా ఎవరో జగన్ ను వెనకుండి నడిపించినట్లే కనపడింది. ఆయనకంటూ సొంత ఆలోచనలు లేవు. బయట జరిగే విషయాలు ఆయనకు తెలియకుండా ఒక బలమైన కోటరీ అడ్డం పడిందనే చెబుతున్నారు.
కోటరీ మధ్యలో...
క్షేత్రస్థాయిలో ప్రధాన సమస్యలతో పాటు ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని జగన్ దగ్గరకు తీసుకెళ్లలేకపోయారు. ఆ కోటరీ ఎవరినీ అనుమతించేదిలేదు. జగన్ దర్శన భాగ్యం ఎవరికీ దక్కదు. చివరకు మంత్రులు కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిలుపు వస్తేనే అక్కడకు వెళ్లాలి తప్పించి.. వారంతట వారు జగన్ ను కలిసేందుకు అవకాశం లేదు. మంత్రులకు కూడా జగన్ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు ఈరోజు సమాధానం దొరకలేదు. కేవలం సంక్షేమం పైనే దృష్టి పెట్టి అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. అంతే కాదు నేల విడిచి సాము చేసినట్లే కనపడుతుంది.
నేతలను పక్కన పెట్టి...
ఇక ఎప్పుడైతే జగన్ నాయకత్వాన్ని పక్కనపెట్టి వాలంటీర్లను నియమించారో.. అప్పుడే లీడర్షిప్ అనేది నిర్వీర్యమయింది. పార్టీ యంత్రాంగం మొత్తం కుదేలైపోయింది. గత ఎన్నికల్లో చొక్కాలు చించుకుని పనిచేసిన క్యాడర్ ను ఏ మాత్రంపట్టించుకోలేదు. ఎమ్మెల్యేలకే గతి లేనప్పుడు ఇక సామాన్య కార్యకర్తల గురించి ఈ పార్టీ చీఫ్ లు ఎందుకు ఆలోచిస్తారు? వాలంటర్ల వ్యవస్థతో పూర్తిగా తనకు అనుకూలంగా మలచుకోవాలని భావించిన జగన్ కు అదే శాపమయింది. మరోవైపు కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే కూటమిగా ఏర్పడటానికి అవకాశం ఇచ్చి జగన్ మరో తప్పు చేశారన్నది పార్టీ వర్గాలనుంచి వినిపిస్తున్న టాక్. మొత్తంమీద తెలంగాణలో కేసీఆర్ కానీ, ఏపీలో జగన్ కానీ స్వయంకృతాపరాధంతోనే ఓటమిని కొని తెచ్చుకున్నారు. వారిని ప్రత్యర్థులు ఓడించలేదు. వారిని వాళ్లే ఓడించుకున్నారు.
Next Story