Wed Apr 23 2025 18:06:19 GMT+0000 (Coordinated Universal Time)
Posani Krishna Murali :పోసానిని అరెస్ట్ చేయడానికి అసలు కారణమిదేనా?
సినీ రచయిత, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సినీ రచయిత, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోసాని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ మీద అసభ్య పదజాలంతో దూషించారు. అన్నమయ్య జిల్లాలో నమోదయిన కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయనపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసిన పోలీసులు రాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని మై హోమ్ భుజా అపార్ట్ మెంట్ లోనిఆయన నివాసానికి వెళ్లన పోలీసులు ఆయననలు అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆయనపై బీఎన్ఎస్ లోని 196, 353(2), 111 రెడ్ విత్ 3, (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తీసుకెళ్లారు.
ప్రభుత్వ టార్గెట్ లో...
పోసాని కృష్ణమురళి కూటమి ప్రభుత్వం టార్గెట్ లో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు, పోసాని మాట్లాడిన మాటలు తమ అధినేతలతో పాటు వారి ఇంట్లో వారిని కించపర్చే విధంగా ఉన్నాయని అనేక మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రెడ్ బుక్ లోనూ పోసాని పేరు మొదటి పేజీలోనే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని వైసీపీ కోల్పోగానే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ లోని మై హోమ్ భుజా అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేస్తారని ఎప్పటి నుంచో తెలుసు. ఇప్పటికే వరసగా వైసీపీ నేతలు అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో పోసాని కూడా ముందు వరసలో ఉంటారని అందరూ అంచనా వేశారు.
అధికారంలో ఉన్నప్పుడు...
దీంతో పాటు పోసాని కృష్ణమురళి అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లోనూ, విజయవాడలోనూ మీడియా సమావేశాలు పెట్టి దూషించడం టీడీపీ క్యాడర్ ను బాధించింది. అసభ్య కరమైన పదజాలంతో దూషించడంతో ఆయనపై కేసు నమోదవుతుందని భావించారు. కానీ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో తనను కూటమి ప్రభుత్వం వదిలేస్తుందని ఆయన భావించారు. కానీ సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు మాత్రం తమ చెవుల్లో పోసాని దూషణలు మార్మోగిపోతున్నాయని, ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఆయనపై పలు స్టేషన్లలో కేసు నమోదు అవ్వడమే కాకుండా సీఐడీ కూడా కేసు నమోదు చేసింది. అనేక జిల్లాల్లో పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదు కావడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోసాని కృష్ణమురళి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫిలిం డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా కూడా పనిచేశారు.
Next Story