Dhulipalla Narendra : అందుకే ఏ పదవీ దక్కడంలేదా భయ్యా
పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీలో సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్రకు పదవీ యోగం లేనట్లే కనిపిస్తుంది
పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీలో సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్రకు పదవీ యోగం లేనట్లే కనిపిస్తుంది. ఎందరికలో పదవులు లభిస్తున్నా నరేంద్రకు మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా పదవులు మాత్రం దక్కడం లేదు. నరేంద్ర కు మంత్రి పదవి రావాల్సినంత సీనియారిటీ ఉంది. ఆయన సామాజికవర్గంగా కూడా బలమైన నేత. ఆయన ఇప్పటికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2994లో పొన్నూరు నియోజకవర్గం నుంచి గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర ఇక వెనుదిరిగి చూడలేదు.
మంత్రి పదవికి దూరమై…
1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరసగా విజయం సాధించారు. ఒక్క 2019 ఎన్నికల్లో మాత్రమే కిలారు రోశయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. మరోసారి 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. 1994 లో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య మరణంతో తెలుగుదేశం పార్టీలోకి అడుగుపెట్టిన ధూళిపాళ్ల నరేంద్ర ఇక వెనుదిరిగి చూడలేదు. పక్క చూపులు చూడలేదు. ఆయనకు వివాద రహితుడిగా పేరుంది. అదే సమయంలో అవినీతి మచ్చ కూడా ఇంత వరకూ అంటలేదు. అయితే అదేందో కానీ నరేంద్ర విజయం సాధించినా, టీడీపీ అధికారంలోకి వచ్చినా ఆయనకు మంత్రి పదవి మాత్రం దక్కలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ తరుపున పోరాటం చేసిన వాళ్లలో నరంద్ర ఒకరు.
ఆరోసారి గెలిచినా…
ఆరోసారి గెలిచి ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే సీనియర్ నేతగా ధూళిపాళ్ల నరేంద్ర ఉన్నారు. 2024 కూటమి గెలిచిన తర్వాత ఆయనకు టీడీపీ కోటాలో మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ అదే సామాజికవర్గానికి చెందిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ కు మంత్రి పదవి దక్కడంతో సామాజికవర్గం కోటాలో ధూళిపాళ్లనరేంద్ర పేరును పక్కన పెట్టినట్లే కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో నరేంద్ర ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చివరకు అరెస్టయి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అయినా నరేంద్ర కు మాత్రం ఎటువంటి పదవులు దక్కకపోవడం ఆయన వర్గంలో చర్చనీయాంశమైంది.
సంగం డెయిరీ ఛైర్మన్ గా…
అయితే నరేంద్ర సంగం డెయిరీ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. ఆ పదవి ఉన్నందున మరో పదవి ఇవ్వడానికి టీడీపీ అధినాయకత్వం మొగ్గు చూపడం లేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అయితే నరేంద్ర పార్టీని నమ్ముకున్న విధానం, గెలిచిన తీరును చూసైనా మంత్రి పదవి కాకపోయినా కేబినెట్ ర్యాంకు ఉన్న మరో పదవిని ఇస్తే బాగుండేదన్నఅభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతుంది. అయితే నరేంద్ర ముక్కుసూటి మనస్తత్వం ఆయనను పదవులకు దూరం చేస్తుందన్న వాదన కూడా లేకపోలేదు. మొత్తం మీద ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా నరేంద్రకు పదవి దక్కకపోవడం పై ఆయన అనుచరులు పెదవి విరుస్తున్నారు పార్టీ అధినాయకత్వం మాత్రం సంగం డెయిరీ ఛైర్మన్ పదవికి రాజీనాామా చేస్తే పదవి ఇస్తామన్న ప్రతిపాదన పెట్టినా అందుకు నరేంద్ర తిరస్కరించినట్లు తెలిసింది.