Mon Dec 23 2024 16:51:35 GMT+0000 (Coordinated Universal Time)
ఆ పూజలు.. క్షుద్ర పూజలేనా?
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి కృష్ణానది ఒడ్డున అర్ధరాత్రి
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి కృష్ణానది ఒడ్డున అర్ధరాత్రి కొన్ని పూజలు జరగడంపై స్థానికుల్లో టెన్షన్ మొదలైంది. అయితే అవి క్షుద్ర పూజలేనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా గ్రామంలోని కృష్ణానది ఒడ్డున ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన స్థలంలో పూజలు జరిగాయని అంటున్నారు. మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరావు ఈ పూజల్లో పాల్గొన్నారని తెలుస్తోంది.పూజల అనంతరం గొల్లపూడి సమీపంలో కృష్ణానది మధ్యన లంక ప్రదేశంలో ఉన్న ఆలయంలో కూడా పూజలు చేసినట్లు తెలిసింది. అవి క్షుద్రపూజలేనంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రచారం చేశారు. ఈ కథనాలపై దేవినేని ఉమా స్పందించాల్సి ఉంది.
దేవినేని ఉమా సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తే మాత్రం ఆయన పలు పూజల్లో పాల్గొన్నానని తెలిపారు. "ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి లో కృష్ణానది తీరంలో ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఉllవేllప్ర శ్రీ శ్రీ శ్రీ డా. బాలకృష్ణ గురూజీ గారి ఆద్వర్యంలో జరుగుతున్న త్రిదిన త్రికాల విష్ణు దుర్గ యాగంలో భాగంగా నేడు జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో మాజీమంత్రి కొల్లు రవీంద్ర, గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావులతో పాటు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ పరిశీలకులు దారునాయక్ మరియు మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు." అంటూ ఆయన పోస్టు పెట్టారు. "మా అధినేత @ncbn సీఎం కావాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, గుంటుపల్లి కృష్ణ తీరం లో ఉllవేllప్ర శ్రీ శ్రీ శ్రీ డా. బాల కృష్ణ గురూజీ గారి ఆద్వర్యం లో రాజ్య లక్ష్మీ యాగం లో పాల్గొనటం జరిగింది" అంటూ మరో ట్వీట్ లో కూడా పూజకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.
Next Story