Mon Dec 23 2024 07:01:29 GMT+0000 (Coordinated Universal Time)
జ్ఞానానంద ఆశ్రమంలో దారుణం.. పూర్ణానంద స్వామీజీ అరెస్ట్
ఆశ్రమంలో పనిచేసే పనిమనిషి సహాయంతో జూన్ 13న బాధిత బాలిక ఆశ్రమం నుండి బయటపడి.. తిరుమల ఎక్స్ ప్రెస్ ఎక్కింది.
చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఓ బాలికను బంధువులు విశాఖలోని కొత్త వెంకోజీపాలెం వద్ద ఉన్న జ్ఞానానంద స్వామీజీ ఆశ్రమానికి సేవల నిమిత్తం పంపారు. బాలికను చేరదీసి.. మంచిచెడులు చెప్పాల్సిన స్వామీజీ ఆమెపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారంటూ.. పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విజయవాడలో ఉన్న పూర్ణానంద స్వామీజీని అరెస్ట్ చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన 15 ఏళ్ల బాలిక చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఐదవ తరగతి వరకూ చదివించిన బంధువులు.. బాలికను రెండేళ్ల క్రితం విశాఖ జ్ఞానానంద ఆశ్రమంలో సేవల నిమిత్తం పంపారు.
ఆశ్రమానికి వచ్చిన బాలికతో నిర్వాహకుడైన పూర్ణానంద స్వామీజీ బాలికతో ఆవులకు మేత వేయించడం, పేడ తీయడం వంటి పనులను చేయించేవారు. అర్థరాత్రి అయ్యాక తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేవారని బాధిత బాలిక పేర్కొంది. ఏడాది కాలంగా తన గదిలోనే కాళ్లకు గొలుసు వేసి బంధించి ఎదురుతిరిగితే కొట్టేవారని, రెండు చెంచాల అన్నాన్ని నీటిలో కలిపి పెట్టేవారని తెలిపింది. రెండువారాలకు ఒకసారి మాత్రమే స్నానం చేయనిచ్చేవారని, కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా అనుమతించేవాడు కాదని.. ఇలా రెండేళ్లుగా తనను చిత్రహింసలకు గురిచేశారని వాపోయింది.
ఆశ్రమంలో పనిచేసే పనిమనిషి సహాయంతో జూన్ 13న బాధిత బాలిక ఆశ్రమం నుండి బయటపడి.. తిరుమల ఎక్స్ ప్రెస్ ఎక్కింది. రైలులో పరిచయమైన మహిళతో తన గోడు వెళ్లబోసుకుంది. సదరు మహిళ రెండురోజుల క్రితం కృష్ణాజిల్లా కంకిపాడులోని హాస్టల్ లో చేర్చేందుకు ప్రయత్నించగా.. పోలీస్ స్టేషన్ నుంచి లేఖ తీసుకొస్తేనే చేర్చుకుంటామని చెప్పడంతో కంకిపాడు పీఎస్ కు వెళ్లారు. పోలీసులు ఇచ్చిన లేఖతో బాలల సంక్షేమ కమిటీకి బాలికను తీసుకెళ్లగా.. ఆశ్రమంలో తాను చూసిన నరకాన్నంతా వివరించింది. వెంటనే సీడబ్ల్యూసీ సభ్యులు బాలికను విజయవాడలోని దిశ పోలీస్ స్టేషన్ కు పంపగా.. పూర్ణానంద స్వామీజీపై పోక్సో కేసు నమోదు చేసి, బాలికను వైద్య పరీక్షలకు పంపారు.
బాలిక ఫిర్యాదు ఆధారంగా విశాఖ పోలీసులు స్వామీజీని అరెస్ట్ చేశారు. ఆశ్రమ భూముల్ని కొందరు కొట్టేయాలని చూస్తున్నారని, అందుకే తనపై ఇలా కుట్ర చేశారని ఆయన వాపోయారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. ఈ కేసులో నిజనిజాలు తేల్చేపనిలో పడ్డారు పోలీసులు.
Next Story