Mon Dec 23 2024 09:32:43 GMT+0000 (Coordinated Universal Time)
నారా లోకేష్ కోర్టుకు లాగడంపై స్పందించిన పోసాని
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైసీపీ నేత, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైసీపీ నేత, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి తీవ్ర విమర్శలు చేశారు. నారా లోకేష్ పోసానిని కోర్టుకు లాగిన సంగతి తెలిసిందే..! ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేశ్ ఎవరిపై విమర్శలు చేయలేదా అని పోసాని ప్రశ్నించారు. లోకేష్‌పై పరువు నష్టం దావా వేస్తే కనీసం 20 ఏళ్లు జైల్లో వుంటారని పోసాని హెచ్చరించారు. సీఎంపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేసిన లోకేష్‌పై పరువు నష్టం దావా వేయకూడదా అని పోసాని ప్రశ్నించారు. నాపై పాత కేసులు పెట్టి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కృష్ణమురళీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను హత్య చేయడానికి లోకేష్ కుట్ర పన్నుతున్నారని.. కోర్ట్‌కు హాజరయ్యేటప్పుడు తనను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు.
కొంతమందికి కులం పిచ్చి ఎక్కించి తనను తిట్టిస్తున్నారని పోసాని అన్నారు. కులాభిమానం వుండొచ్చు కానీ.. దురాభిమానం వుండకూడదన్నారు. గెలిచింది ఎవరైనా ప్రజలకు మంచి చేస్తున్నారా లేదా అనేది చూడాలని పోసాని కృష్ణమురళీ అన్నారు. రైతుల కష్టాలను తీర్చడానికి వైఎస్సార్ రూ.11 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేశారని ప్రశంసించారు. అమరావతిలో 5 శాతం భూములు పేదలకు ఇవ్వాలని చట్టంలో వుందని, ఆ చట్టాన్ని చంద్రబాబు తుంగలో తొక్కారని పోసాని ఆరోపించారు. పెదకాకానిలో తనకు కొన్ని ఇళ్ల స్థలాలు మాత్రమే వున్నాయని, తన కష్టార్జితంతోనే ఆ భూములు కొన్నానని ఆయన తెలిపారు. అవసరమైతే నా భూములన్నీ పేదలకు ఉచితంగా ఇచ్చేస్తానని, పేదల భూములపై వేసిన కేసులు వెనక్కి తీసుకోవాలని పోసాని సవాల్ విసిరారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని తన జీవితాంతం వైఎస్ జగన్ వెంటే వుంటానని కృష్ణమురళీ అన్నారు. జగన్ వ్యక్తిత్వం నచ్చే ఆయన్ని అభిమానిస్తున్నానని పోసాని తెలిపారు. కంతేరులో భూమి కొన్నాడని అనడం ఆయనకు పరువు నష్టం అయ్యిందట అని పోసాని విమర్శించారు. హెరిటేజ్ సంస్థ పేరుతో భూములు కొన్నది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. లోకేశ్ తల్లి, భార్య ఆస్తులు ఆయనవి కాదా అని నిలదీశారు.
Next Story