Thu Apr 24 2025 20:19:53 GMT+0000 (Coordinated Universal Time)
Posani Krishna Murali : కొడాలి అనుకున్నాం కానీ.. పోసాని వైపు టర్న్ అయిందే?
పోసాని కృష్ణమురళి మాటల రచయిత కావచ్చు. సినీ నటుడుగా ఆయన ప్రస్థానం సుదీర్ఘకాలమే.

పోసాని కృష్ణమురళి మాటల రచయిత కావచ్చు. సినీ నటుడుగా ఆయన ప్రస్థానం సుదీర్ఘకాలమే. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మటలు టీడీపీ, జనసేన క్యాడర్ లో నేటికీ రివ్వుమంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంకా చర్యలు తీసుకోకపోతే ఎలా? ఇంత మెతక వైఖరి అయితే ఎలా అని టీడీపీ క్యాడర్ సొంత సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. జగన్ పై ప్రేమ ఉండొచ్చు. అభిమానం ఎక్కువగానే ఉండవచ్చు. కానీ ఇంత పరుషమైన పదజాలంతో మాట్లాడిన తీరు కేవలం టీడీపీ క్యాడర్ కే కాకుండా ఇతర పార్టీ నేతలకు కూడా ఏవగింపు కలిగించాయి. పోసాని కృష్ణ మురళి నాడు చేసిన కామెంట్స్ ను ఇప్పటికీ మరిచిపోలేక పోతున్నారు.
కొడాలి నాని అనుకున్నా...
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోసాని కృష్ణమురళి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో తనను ఎవరూ పట్టించుకోరని అంచనా వేశారు. తన మానాన తాను బతకవచ్చు అని బావించారు. అందుకే ధీమాగా ఉన్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత అందరూ కొడాలి నానిని తర్వాత అరెస్ట్ చేస్తారని అందరూ భావించారు. కానీ ఉన్నట్లుండి సీన్ పోసాని కృష్ణమురళి వైపు టర్న్ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై పోసాని చేసిన వ్యాఖ్యలు అందరి మనోభావాలను కించపర్చే విధంగా ఉన్నాయి. మీడియా సంస్థల్లో ఇంటర్వ్యూల్లో కూడా పోసాని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం వారి ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసినట్లయింది.
అన్ని పోలీస్ స్టేషన్ లో...
అందుకే కూటమి ప్రభుత్వం రాగానే ఏపీలోని నలుమూలల అన్ని పోలీస్ స్టేషన్లలో పోసాని కృష్ణమురళి పై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అయితే పోసాని తనవరకూ రాకపోవచ్చని భావించారు. ఫిలిం డెవలెప్ మెంట్ ఛైర్మన్ గా ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ ఇండ్రస్ట్రీని కూడా కించపర్చేలా మాట్లాడటంతో ఆయనకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మద్దతు కరువయింది. పోసాని కృష్ణమురళి అరెస్ట్ తో సానుభూతి వస్తుందని భావించినా అది ఆదిలోనే ఆవిరయింది. తెలుగుదేశం సోషల్ మీడియాలో పోసాని చేసిన కామెంట్స్ ను రీపోస్ట్ చేస్తూ ఇలాంటి వారిని అరెస్ట్ చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. పోసానిని కొన్ని గంటలుగా పోలీసులు ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పడం లేదంటున్నారు. మొత్తం మీద సినిమాల్లో డైలాగులు రాయడం వరకూ ఓకే.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఫలితం అనుభవించక తప్పదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Next Story