లిఖితపూర్వకంగా పిలిస్తేనే చర్చలకు వెళతాం
తమపై ఎప్పుడుపడితే అప్పుడు చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని పీఆర్సీ సాధన సమితి నేతలు చెప్పారు.
తమపై ఎప్పుడుపడితే అప్పుడు చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని పీఆర్సీ సాధన సమితి నేతలు చెప్పారు. ఆర్థిక శాఖ అధికారులు ఈ విషయాన్ని గుర్తెరగాలన్నారు. పీఆర్సీ సాధన సమావేశం ముగిసిన తర్వాత నేతలు మీడియాతో మాట్లాడారు. ఆర్థిక శాఖ అధికారులు తమ ఉద్యోగులపై వత్తిడి తెస్తున్నారని, ఐఏఎస్ అధికారులపై అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తమపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేరని, తాము న్యాయబద్ధంగానే పోరాడుతున్నామని చెప్పారు. తాటాకు చప్పుళ్లకు భయపడబోమని వారు చెప్పారు. ప్రభుత్వం చర్చల విషయంలో తప్పుదోవ పట్టిస్తుందన్నారు. మంత్రుల కమిటీ ఒకే ఒకసారి చర్చలకు ఆహ్వానం పలికారని, అంతకు మించి తమకు ఆహ్వానం రాలేదన్నారు. వారి ఆహ్వానం మన్నించి తమ ప్రతినిధులను చర్చలకు పంపామని, వారి పట్ల మంత్రుల కమిటీ అమర్యాదకరంగా ప్రవర్తించిందన్నారు. తమను ఎవరూ చర్చలకు పిలవలేదన్నారు. మీడియలో చెప్పడమే తప్ప తమను చర్చలకు ఆహ్వానించలేదన్నారు. లిఖితపూర్వకంగా పిలిస్తేనే చర్చలకు వెళతామని నిర్ణయించామన్నారు.