Fri Nov 22 2024 18:44:49 GMT+0000 (Coordinated Universal Time)
మంగళగిరి ఎయిమ్స్.. జాతికి అంకితం
మంగళగిరిలో నిర్మించిన ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను ప్రధాని నరేంద్ర మోదీ
మంగళగిరిలో నిర్మించిన ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. మంగళగిరి ఎయిమ్స్ ను జాతికి అంకితం చేశారు. మంగళగిరి ఎయిమ్స్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, భారతి ప్రవీణ్, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 5 ఎయిమ్స్ ను ప్రధాని మోదీ ఏకకాలంలో ప్రారంభించారు. మంగళగిరి ఎయిమ్స్ తో పాటు రాజ్ కోట్ (గుజరాత్), భటిండా (పంజాబ్), రాయ్ బరేలీ (ఉత్తరప్రదేశ్), కల్యాణి (పశ్చిమ బెంగాల్) ఎయిమ్స్ లను కూడా మోదీ ప్రారంభించారు.
మంగళగిరి ఎయిమ్స్‌లోని 9 క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు ప్రధాని శంకుస్థాపన చేశారు. రూ.1,618.23 కోట్లతో 183.11 ఎకరాల్లో 960 పడకలతో ఎయిమ్స్ ఆస్పత్రిని నిర్మించారు. ఇందులో 125 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఉంది. విభజన హామీల్లో భాగంగా మంగళగిరికి ఈ ఎయిమ్స్ వచ్చింది. మంగళగిరి ఎయిమ్స్‌లో 2019 మార్చి నుంచే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. రోజుకు రెండున్నర వేల మంది రోగులు అక్కడ వైద్యం పొందుతున్నారు. 2018 నుంచే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేస్తున్నారు. మంగళగిరి ఎయిమ్స్‌లో ప్రస్తుతం 600 మంది వైద్య విద్యార్థులు చదువుకుంటున్నారు. మరో 100 మంది వివిధ కోర్చుల్లో పీజీ చేస్తున్నారు.
Next Story