Tue Nov 05 2024 16:30:12 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్రప్రదేశ్ హస్త కళలపై ప్రపంచ దేశాల ఆసక్తి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేనేత, హస్త కళలకు పుట్టినిల్లుగా ఉంది. రాష్ట్రంలో ఎన్నో ఉత్పత్తులు భౌగోళిక గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేనేత, హస్త కళలకు పుట్టినిల్లుగా ఉంది. రాష్ట్రంలో ఎన్నో ఉత్పత్తులు భౌగోళిక గుర్తింపు కలిగి ఉన్నాయి. ఈ గుర్తింపు ద్వారా ఉత్పత్తుల కొనుగోలుదారులలో అవగాహన, విశ్వాసాన్ని పెంపొందించవచ్చు. ఇన్క్రెడిబుల్ ఇండియా ట్రెజర్స్ భారతదేశానికి చెందిన 460పైగా ఉత్పత్తులను పరిశీలించి గుర్తింపు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ODOP)అనే పథకం ఎన్నో చిన్న, మధ్య తరహ పరిశ్రమలకు చేయూతనిస్తుంది.
ఆన్ లైన్ లో ఏవైనా కొనొచ్చు:
ఆప్కో ఆన్లైన్ స్టోర్ ద్వారా ఆర్డర్ చేసి మంగళగిరి, వెంకటగిరి, మాధవరం, బందరు, రాజమండ్రి, ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, చీరాల తదితర చేనేత, పట్టు, కాటన్ చీరలు, వస్త్రాలు వంటి వాటిని కొనేయొచ్చు. చేనేత, హస్త కళల ఉత్పత్తులకు మరింతగా మార్కెటింగ్ కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సౌజన్యంతో ‘ఆప్కో ఆన్లైన్ స్టోర్, లేపాక్షి వెబ్ స్టోర్’లు ప్రారంభమయ్యాయి.
రాష్ట్రంలో ప్రాచుర్యం పొందిన కళలు, వృత్తులకు ఆప్కో ఆన్లైన్ స్టోర్, లేపాక్షి వెబ్ స్టోర్ ద్వారా జాతీయ, అంతర్జాతీయంగా మరింతగా మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. ఆయా వృత్తుల కళాకారులకే కాకుండా, వారి ఉత్పత్తులకు కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించేలా ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్ర, అజియో, పేటీఎం వంటి ఈ-ప్లాట్‌ఫామ్‌లలో కూడా చేనేత, హస్త కళల ఉత్పత్తులు అందుబాటులో ఉంచారు.. ఆయా సంస్థలతో లేపాక్షి, ఆప్కో ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రపంచ దేశాల నుండి మన రాష్ట్ర హస్త కళలకు ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. ఇక లేపాక్షి వెబ్ స్టోర్ ద్వారా కొండపల్లి, ఏటికొప్పాక, పెడన, చిత్తూరు కలంకారీ ఉత్పత్తులు, దుర్గి రాతి శిల్పాలు, బుడితిలో తయారయ్యే ఇత్తడి వస్తువులు, శ్రీకాకుళం ఆదివాసీ పెయింటింగ్‌లు, ఉదయగిరిలో చెక్కతో తయారయ్యే కళాఖండాలు, బొబ్బిలి వీణ, ధర్మవరం తోలు బొమ్మలు పొందవచ్చు. ఇలాంటి ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండటంతో ఉపాధి అవకాశాలు మరింతగా పెరగడం వలన వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయి. ఈ పథకం ద్వారా హస్తకళల ఉత్పతుత్తులను ప్రోత్సహించడం వలన ఉపాధి అవకాశాలు మరింతగా విస్తరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అంతేకాకుండా పోటీ ప్రపంచాన్ని తట్టుకునే విధంగా గ్రామస్థాయిలో హస్త కళాకారులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ, వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు పెరిగేలా ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి వారి ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేస్తుంది.
Next Story