Sat Nov 23 2024 05:22:24 GMT+0000 (Coordinated Universal Time)
మహిళల రక్షణలో వైసిపి వైఫల్యం : రేపు ఏపీ వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు
రాష్ట్రంలో మద్యం మత్తులో కీచకులు అత్యాచారాలు,అఘాయిత్యాలు చేస్తూ, ప్రభుత్వానికి, పోలీసులకు సవాల్ చేయడం..
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ కరువైందని, మహిళలను కాపాడటంలో వైసీపీ ప్రభుత్వం, పోలీసు శాఖ విఫలమైందని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో మహిళలు, యువతులు, ముక్కుపచ్చలారని చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలు ప్రభుత్వం విఫలమైందనడానికి అద్దం పడుతున్నాయన్నారు. మహిళలను రక్షించడంలో వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్మలా కిషోర్ పిలుపునిచ్చారు.
గురువారం ఉదయం 10 గంటలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో అబలలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ప్రశ్నించినప్పుడల్లా.. వైసిపి ప్రభుత్వం ఏదో కారణం చెప్పి పబ్బం గడుపుతోందని నిర్మలా కిషోర్ దుయ్యబట్టారు. రాష్ట్ర హోంమంత్రుల హోదాలో మహిళలు ఉన్నప్పటికీ.. మహిళల భద్రతా పరిస్థితుల్లో ఏ మార్పూ లేకపోగా.. మరింత దిగజారడం దురదృష్టకరమన్నారు.
రాష్ట్రంలో మద్యం మత్తులో కీచకులు అత్యాచారాలు,అఘాయిత్యాలు చేస్తూ, ప్రభుత్వానికి, పోలీసులకు సవాల్ చేయడం.. వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనకు అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. ఏపీలో రాజన్న రాజ్యాన్ని తెస్తామంటూ.. రాష్ట్రాన్ని రావణకాండగా మార్చారని అధికార వైసీపీపై మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని.. కామాంధుల పశువాంఛకు మరో అబల బలికాక ముందే.. మహిళల రక్షణకై తగు చర్యలు తీసుకోవాలని నిర్మలా కిషోర్ డిమాండ్ చేశారు.
Next Story