Mon Dec 23 2024 14:15:56 GMT+0000 (Coordinated Universal Time)
రామతీర్థంలో ప్రోటోకాల్ గొడవ.. అశోక్ గజపతిరాజుకు అవమానం
రామతీర్థం వేదికగా.. అశోక్ గజపతిరాజుకు అవమానం జరిగింది. గతంలోనూ ఇక్కడే రాజకీయ రగడ జరగ్గా.. ఈరోజు కూడా అలాంటి సీనే రిపీట్ అయింది. బోడికొండపై ధ్వంసమైన విగ్రహాలను తిరిగి ప్రతిష్టించడం, రామాలయం ఏర్పాటుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ రోజే అక్కడ శంకుస్థాపన చేయాలి. అనుకున్న దాని ప్రకారం రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు మంత్రి వెల్లంపల్లి రామతీర్థం వెళ్లారు. కాగా.. అక్కడే ప్రోటోకాల్ రగడ మొదలైంది. తనను కొబ్బరికాయ కూడా కొట్టనివ్వకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారంటూ అశోక్ గజపతి రాజు ఆందోళనకు దిగారు.
కనీస మర్యాద ఇవ్వలేదు..
అంతేకాదు.. శంకుస్థాపన శిలాఫలకం పై కూడా అశోక్ గజపతి పేరును చేర్చలేదు. ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నట్లు ధర్మకర్త అయిన తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని అశోక్ గజపతి వాపోయారు. ఆలయం ధర్మ కర్త కు కనీసం మర్యాద ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. గుడికి విరాళం ఇస్తే తిరిగి ఇచ్చేశారని... భక్తులిచ్చిన విరాళాలు తిరస్కరించడానికి అధికారం ఎవరు ఇచ్చారని నిలదీసారు. ఈ ప్రభుత్వం హయాంలో వందలాది ఆలయాలు ధ్వంసం జరిగాయని ఫైర్ అయ్యారు. బోడికొండ విగ్రహాల ధ్వంసం ఘటన జరిగి ఏడాది కావస్తున్నా ఇంతవరకూ నిందితులను పట్టుకోలేకపోయారని, కేసు తాలూకా ఆధారాలన్నింటినీ తారుమారు చేశారని దుయ్యబట్టారు. ఇంతలోనే ఎవరో అశోక్ గజపతి రాజును పక్కకు నెట్టేశారు. తనను ఇంతలా అవమానించడంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన శిలాఫలకాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. తన అనుచరులతో కలిసి అక్కడే బైఠాయించారు. అంత ఉద్రిక్త పరిస్థితిలోనూ మంత్రి వెల్లంపల్లి ఆలయానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తిచేశారు. మొత్తానికి అశోక్ గజపతిరాజు లేవనెత్తిన ప్రోటోకాల్ అంశం రెండువర్గాల మధ్య ఘర్షణలకు దారితీసేలా కనిపిస్తోంది.
Next Story