Mon Dec 15 2025 04:07:42 GMT+0000 (Coordinated Universal Time)
కోస్తాంధ్రలో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తీవ్ర వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఈ సాయంత్రానికి తుపానుగా మారి ఉత్తర వాయవ్య దిశలో బంగ్లాదేశ్ తీరం వైపు పయనిస్తుందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 25 సాయంత్రం బంగ్లాదేశ్ తీరంలో ఖేపుపారా-చిట్టగాంగ్ ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశముందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అరేబియా మహా సముద్రంలో తేజ్ తుపాన్ తో పాటుగా బంగాళాఖాతంలో హమూన్ తుపాన్ కూడా ఒకేసారి ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తేజ్ తుపాను ఈ నెల 22 న తీవ్ర తుపానుగా మారే అవకాశముందని హెచ్చరించింది. ఈ తుపాను ఆల్గైదా, సలాలా మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్య కారులను చేపలవేటకు వెళ్లవద్దని ప్రభుత్వాలు నిషేధం విధించాయి. హమూన్ తుపాన్ ఆంధ్రప్రదేశ్ తీరం దిశగా కదులుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళ, తమిళనాడుతో పాటు ఏపీ కోస్తా తీర ప్రాంతంలోనూ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
Next Story

